Telugu Global
Telangana

మండలిలో కాంగ్రెస్ కు చిక్కులు తప్పవా..?

ప్రస్తుతం ఉన్న మండలిలోని 8 మంది సభ్యుల పదవీకాలం మార్చి 2025లో ముగియనుంది. ఇందులో నలుగురు ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికయ్యారు.

మండలిలో కాంగ్రెస్ కు చిక్కులు తప్పవా..?
X

అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్‌కు.. కీలక బిల్లులను పాస్‌ చేసుకునే విషయంలో మండలి రూపంలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్‌కు పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. బీఆర్ఎస్‌కు 30 మంది, దాని మిత్రపక్షం MIMకు ఇద్దరు సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం మండలిలో ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు.

15 నెలలు గడిస్తే మండలిలో 8 స్థానాలు ఖాళీ కానున్నాయి. మిగిలిన వారి పదవీ కాలం క్రమంగా 2026, 2027, 2028, 2029 వరకు ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలో బీఆర్ఎస్‌ సైతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అయితే కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకోవడంలో ఆ టైమ్‌లో బీఆర్ఎస్ అధిష్టానం సక్సెస్ అయింది. ప్రస్తుతం బీఆర్ఎస్‌తో పాటు స్వతంత్ర ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ తనవైపు తిప్పుకునే ప్రయత్నాలను కొట్టిపారేయలేం.

ప్రస్తుతం ఉన్న మండలిలోని 8 మంది సభ్యుల పదవీకాలం మార్చి 2025లో ముగియనుంది. ఇందులో నలుగురు ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికయ్యారు. మరొకరు స్థానిక సంస్థల కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 14 మంది మండలి సభ్యులుండగా.. ఐదుగురు మార్చి 2025లో స‌భ్య‌త్వం కోల్పోనున్నారు. మరో ఆరుగురు 2027 నవంబర్‌లో, మరో ముగ్గరి ప‌ద‌వీకాలం మార్చి 2029తో ముగుస్తుంది.

ఇక స్థానిక సంస్థల‌ కోటాలో 14 మంది సభ్యులున్నారు. ఈ కోటాలో ఎన్నికైన బీఆర్ఎస్ నేత MS ప్రభాకర్ పదవీకాలం మార్చి 2025లో ముగుస్తుంది. మరో ఎమ్మెల్సీది 2028 జనవరిలో ముగుస్తుంది. MIM ఎమ్మెల్సీ పదవీకాలం మే 2029తో ముగియనుంది. ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యుల పదవీకాలం 2028 జనవరి వరకు ఉంది. ఇక పట్టభద్రుల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. ఇందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన మండలికి రాజీనామా చేయనున్నారు. ఆయన పదవీకాలం 2027 మార్చి వరకు ఉంది. ఈ కోటాలో ఎన్నికైన మరో ఎమ్మెల్యే వాణీదేవి పదవీకాలం 2027 వరకు ఉంది. ఇక జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ నేత జీవన్‌ రెడ్డి మండలిలో మార్చి 2025 వరకు కొనసాగనున్నారు.

ఉపాధ్యాయుల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలుండగా.. ఇందులో ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. వీరి పదవీకాలం 2025 మార్చిలో ముగియనుంది. మరో బీజేపీ ఎమ్మెల్సీ వెంకట నారాయణ రెడ్డి పదవీకాలం 2029 మార్చి వరకు ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు తక్షణమే గవర్నర్‌ కోటాలోని రెండు స్థానాలు లభించే అవకాశం ఉంది. మొత్తం గవర్నర్ కోటాలో ఆరు స్థానాలుండగా.. ముగ్గురు 2026 నవంబర్‌లో రిటైర్ కానున్నారు. మరొకరి పదవీకాలం 2027 నవంబర్‌లో ముగియనుంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సూర్యానారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్‌ తమిళిసై హోల్డ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు స్థానాలను కాంగ్రెస్ భర్తీ చేసుకునే అవకాశం ఉంది.

First Published:  6 Dec 2023 7:13 AM GMT
Next Story