Telugu Global
Telangana

కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి.. బీఆర్ఎస్ నుంచి చేరిన నేత‌ల‌కే కాంగ్రెస్ టికెట్లు..?

ఒక‌రు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి బండి ర‌మేష్, మ‌రొక‌రు మాదాపూర్ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌. వీరిద్ద‌రూ తాజాగా బీఆర్ఎస్‌ను వీడారు. వారికి టికెట్లిస్తామ‌నే హామీతోనే కాంగ్రెస్‌లో చేరి ఉంటార‌నే మాట‌ వినిపిస్తోంది.

కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి.. బీఆర్ఎస్ నుంచి చేరిన నేత‌ల‌కే కాంగ్రెస్ టికెట్లు..?
X

టీపీసీసీ 55 మందితో ప్ర‌క‌టించిన తొలి జాబితాలో న‌గ‌రంలో గ‌ట్టి అభ్య‌ర్థులు లేరనే భావ‌న ఆ పార్టీ వ‌ర్గాల్లో నెల‌కొంది. అందుకే రేపో మాపో ప్ర‌క‌టించ‌నున్న రెండో జాబితాలో గెలుపు గుర్రాల కోసం హ‌స్తం పార్టీ అన్వేషిస్తోంది. దానిలో భాగంగానే శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌కు న‌గ‌ర బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్ద‌రు నేత‌ల‌కు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. ఇందులో ఒక‌రు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి బండి ర‌మేష్ కాగా, మ‌రొక‌రు మాదాపూర్ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌. వీరిద్ద‌రూ తాజాగా బీఆర్ఎస్‌ను వీడారు. వారికి టికెట్లిస్తామ‌నే హామీతోనే కాంగ్రెస్‌లో చేరి ఉంటార‌నే మాట‌ వినిపిస్తోంది.

కూక‌ట్‌ప‌ల్లి నుంచి బండి ర‌మేష్‌!

సెటిల‌ర్ల ఓట్లు కీల‌కంగా ఉన్న కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బండి ర‌మేష్‌కు టికెట్ ఇస్తామ‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు హామీ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆయ‌న కాంగ్రెస్‌లో చేరారు. కృష్ణా జిల్లా నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డిన బండి ర‌మేష్ ఆల్విన్ ఇండ‌స్ట్రీస్‌లో ప‌ద‌కొండేళ్లు ప‌ని చేసి, త‌ర్వాత ర‌క‌ర‌కాల వ్యాపారాలు చేశారు. నిర్మాణ రంగంలో స‌క్సెస్ అయ్యారు. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి 30 వేల ఓట్లు సాధించారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావ‌డం, త‌న సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌తోపాటు సెటిల‌ర్ల ఓట్లు కీల‌కంగా ఉన్న కూక‌ట్‌ప‌ల్లి ప్ర‌భావం చూపే మ‌రో అగ్ర‌వ‌ర్ణం ఓట్లు కూడా రాబ‌డితే ర‌మేష్ విజ‌యం సాధించ‌గ‌ల‌ర‌ని కాంగ్రెస్ న‌మ్ముతున్న‌ట్లు తెలుస్తోంది.

శేరిలింగంప‌ల్లి నుంచి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌!

మ‌రోవైపు బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీ టికెట్ కోరుకున్న మాదాపూర్ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. త‌న భార్య, హ‌ఫీజ్‌పేట కార్పొరేట‌ర్ పూజిత గౌడ్‌తో క‌లిసి కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌కు శేరిలింగంప‌ల్లి టికెట్ ఇచ్చేందుకు మంత‌నాలు సాగుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతుడు కావడం, నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు ప్ర‌ధాన ప్రాంతాల్లో భార్యాభ‌ర్తలిద్ద‌రూ కార్పొరేట‌ర్లు కావ‌డం క‌లిసివ‌స్తుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఈ టికెట్ కోరుతున్న కాంగ్రెస్ నేత‌లు జ‌య‌పాల్‌, ర‌ఘునాథ్ యాద‌వ్ దీనికి అంగీక‌రిస్తారా అనేది కీల‌కం కానుంది.

First Published:  21 Oct 2023 7:31 AM GMT
Next Story