Telugu Global
Telangana

మేడిగడ్డపై వాస్తవాలివి.. అసెంబ్లీలో కాంగ్రెస్

వరదల్లో కొన్ని నిర్మాణాలు కొట్టుకుపోయాయి. రూ. 180.39 కోట్లు నష్టం వాటిల్లినట్టు లెక్క తేలింది. డ్యామేజీని సవరించాలంటూ నిర్మాణ ఏజెన్సీ అయిన L&T ని ప్రభుత్వం సంప్రదించినా వారు పట్టించుకోలేదు.

మేడిగడ్డపై వాస్తవాలివి.. అసెంబ్లీలో కాంగ్రెస్
X

మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీ విషయంలో బీఆర్ఎస్ ని మరింతగా కార్నర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆడిట్ రిపోర్ట్ ని ప్రవేశ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్ట్ నిర్మాణ ఒప్పందాల దగ్గర్నుంచి అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ఆ రిపోర్ట్ లో ఏముందంటే..?

మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంకోసం జరిగిన ఒప్పందాల్లో సర్దుబాట్ల వల్ల ప్రభుత్వంపై రూ.2472 కోట్ల అదనపు భారం పడిందని ఆ నివేదిక సారాంశం. మొదట కుదిరిన ఒప్పందం విలువ రూ.1849.31 కోట్లు కాగా.. అందులో చేసిన మార్పులు చేర్పుల వల్ల వ్యయం రూ.4321.44 కోట్లకు పెరిగిందని.. తేడా రూ. 2472.13 కోట్లకు చేరిందని రిపోర్ట్ లో ప్రస్తావించారు. 2016లో పనులు మొదలు పెడితే.. మూడు బ్యారేజీల పనులు జూన్ 2019 నాటికి పూర్తయ్యాయి. 2019 నవంబరులో వచ్చిన వరదలకు బ్యారేజీల గేట్లు తెరిచి నీటిని కిందకు వదిలారు. ఆ వరదల్లోనే కొన్ని నిర్మాణాలు కొట్టుకుపోయాయి. రూ. 180.39 కోట్లు నష్టం వాటిల్లినట్టు లెక్క తేలింది. అయితే డ్యామేజీని సవరించాలంటూ నిర్మాణ ఏజెన్సీ అయిన L&T ని ప్రభుత్వం సంప్రదించినా వారు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ల ప్రకారమే తాము నిర్మాణాలు చేపట్టామని, పైగా ప్రభుత్వమే క్వాలిటీ సర్టిఫికెట్లు కూడా ఇచ్చిందని.. ఇప్పుడు మరమ్మతులకు మా చేతి ఖర్చు ఎందుకు పెడతామని ప్రశ్నించారు. దీంతో మరమ్మతులకోసం ప్రభుత్వం రూ.476.03 కోట్ల తో అంచనాలు రూపొందించింది.

తడిసి మోపెడైన ఖర్చు..

వరదల వల్ల ప్రాజెక్ట్ కి వాటిల్లిన నష్టం రూ.180.39 కోట్లు, మరమ్మతులకోసం తిరిగి పెట్టిన ఖర్చు రూ.476.03 కోట్లు. ఇలా ప్రాజెక్ట్ ల విషయంలో ఖర్చు తడిసిమోపెడైందని నివేదిక వెల్లడించింది. డీపీఆర్ నిబంధనల ప్రకారం హెడ్ వర్క్స్ విలువలో ఒక శాతం మెయింటెనెన్స్ కు ఖర్చు పెట్టాలి. అంటే మూడు బ్యారేజీల నిర్వహణ వ్యయం కేవలం రూ.45కోట్లు మాత్రమే. ఆ విషయంలో ముందుచూపు లేకపోవడంతో ఆ తర్వాత వందల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

రాయల్టీ చెల్లింపుల్లోనూ అవకతవకలు..

బ్యారేజీలో కొంతభాగం మహారాష్ట్రలో ఉండటంతో.. అక్కడ చేపట్టిన నిర్మాణంలో వాడిన ఇసుకకు తెలంగాణ ప్రభుత్వం రాయల్టీ చెల్లించాల్సి వచ్చింది. ఆ రాయల్టీ చెల్లింపుల్లో కూడా అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై రూ.7.32కోట్ల అదనపు భారం పడింది. ఇలా.. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టిందని, కానీ ఫలితం మాత్రం లేదని కాగ్ రిపోర్ట్ తెలిపింది. ఈ రిపోర్ట్ లోని అంశాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీఆర్ఎస్ ని టార్గెట్ చేసింది.

First Published:  15 Feb 2024 6:38 AM GMT
Next Story