Telugu Global
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ కర్నాటక వ్యూహం

ప్రస్తుతం 48 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను ఖరారు చేసింది. వారంతా సోమవారం నుంచి రంగంలోకి దిగాలని ఆదేశించింది అధిష్టానం.

తెలంగాణలో కాంగ్రెస్ కర్నాటక వ్యూహం
X

తెలంగాణలో కాంగ్రెస్ కర్నాటక వ్యూహం

తెలంగాణ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెడుతోంది. తుది జాబితా ప్రకటించాల్సి ఉన్నా.. ఇప్పటికే 100 స్థానాలు ఫైనల్ కావడంతో వారంతా ప్రచారంలో పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు అభ్యర్థులకు బాసటగా కర్నాటక మంత్రుల్ని రంగంలోకి దించింది కాంగ్రెస్. మొత్తం 10మంది కర్నాటక మంత్రుల్ని తెలంగాణ ఎన్నికల్లో క్లస్టర్ ఇన్ చార్జ్ లుగా నియమించారు. ఆయా క్లస్టర్లలో పార్టీ గెలుపుకోసం వారు కృషి చేయాల్సి ఉంటుంది. ఇక 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను కూడా పార్టీ ఖరారు చేసింది.

సహజంగా ఒకటీ రెండు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో మండలాల వారీగా ఇన్ చార్జ్ లను నియమించడం, నియోజకవర్గానికి మంత్రులను పరిశీలకులుగా నియమించడం చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. అసెంబ్లీ ఎన్నికలు కావడంతో తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థులు నేరుగా ప్రచార పర్వంలోకి దిగారు. స్థానికంగా ఉన్న నేతల్నే మండలాలకు ఇన్ చార్జ్ లు గా ప్రకటించారు. అక్కడక్కడ నియోజకవర్గాలకు కూడా పరిశీలకుల్ని ప్రతిపాదించినా.. మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ వ్యూహం అమలు చేయడంలేదు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. ఇటీవలే కర్నాటకలో ఆ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఎన్నికలకోసం కర్నాటక డబ్బుని కాంగ్రెస్ ఇక్కడికి తీసుకొస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ దశలో కర్నాటక బలగాన్ని తెలంగాణలో ఉపయోగించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఏకంగా 10మంది మంత్రుల్ని ఇక్కడ క్లస్టర్ ఇన్ చార్జ్ లుగా వేసింది. దినేష్ గుండూరావు, ప్రియాంక ఖర్గే వంటి కీలక నేతలు ఈ జాబితాలో ఉన్నారు.

ఇక కర్నాటకతోపాటు తెలంగాణ నేతల్ని కూడా ఇక్కడ నియోజకవర్గాలకు పరిశీలకులుగా నియమించింది కాంగ్రెస్. నియోజకవర్గ పరిశీలకులు ఆయా ప్రాంతాల్లోనే మకాం వేసి స్థానిక పరిస్థితులను అంచనా వేస్తూ.. అభ్యర్థులకు తగిన విధంగా సాయపడాలి. ప్రచారంలో సహాయం చేయడమే కాకుండా.. చేరికల విషయాలను కూడా పర్యవేక్షిస్తుండాలి, ప్రత్యర్థి వ్యూహాలను చిత్తుచేసే పని ఈ పరిశీలకులదే. ప్రస్తుతం 48 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను ఖరారు చేసింది. వారంతా సోమవారం నుంచి రంగంలోకి దిగాలని ఆదేశించింది అధిష్టానం.

First Published:  5 Nov 2023 6:29 AM GMT
Next Story