Telugu Global
Telangana

వ్యూహకర్తే పరారీలో ఉన్నాడా?

తమను కించపరుస్తూ యూట్యూబ్ చానళ్ళు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయని కొందరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా పోస్టులు పెడుతున్నవారి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.

వ్యూహకర్తే పరారీలో ఉన్నాడా?
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తగ్గట్లే వ్యూహకర్త కూడా భలేగా దొరికాడు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు పార్టీ అధిష్టానం సునీల్ కానుగోలు అనే వ్యూహకర్తను నియమించుకుంది. ఈయన పన్నుతున్న వ్యూహాలు, ఇస్తున్న సలహాలు ఏమిటో ఎవరికీ తెలీదు. కానీ హఠాత్తుగా ఆయన పరారవ్వటం మాత్రం వార్తల్లో నిలిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

ఇంతకీ సునీల్ ఎందుకు పరారీ అయ్యాడంటే ప్రత్యర్ధుల మీద తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నందుకు. తమను కించపరుస్తూ యూట్యూబ్ చానళ్ళు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయని కొందరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా పోస్టులు పెడుతున్నవారి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. తెలంగాణ గళం, భారతీయుడు లాంటి పేర్లతో పోస్టులు వస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. తమ దగ్గరున్న టెక్నాలజీ ఆధారంగా పోస్టులు ఎక్కడి నుండి పోస్టవుతున్నాయనే విషయాన్ని పోలీసులు కనుక్కున్నారు.

మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ ఆఫీసు నుండి పోస్టులు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం ఆధారంగా ఆఫీసుపై దాడి చేసి ప్రతాప్, ఇశాంత్ శర్మ, శశాంకలను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళని విచారిస్తే వ్యూహకర్త సునీల్ కానుగోలు ఆదేశాల ప్రకారమే తాము దొంగ అడ్రస్‌ల‌తో పోస్టులు పెడుతున్నట్లు అంగీకరించారట.

ఇదే విషయమై హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, సైబర్ క్రైమ్స్ జాయింట్ పోలీసు కమిషనర్ గజానన్ భూపాల్ మాట్లాడుతూ పోస్టులను మైండ్ షేర్ లేదా కాంగ్రెస్ పార్టీ పేరు మీదే పెడితే తప్పులేదన్నారు. కానీ తప్పుడు అడ్రస్‌ల‌తో ఇతరులను కించపరుస్తు పోస్టులు పెట్టడమే నేరమన్నారు. సునీల్‌ను విచారించాలని అనుకుంటే అతను పరారీ అయినట్లు విక్రమ్ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తప్పుడు పోస్టులు పెడితే పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేస్తారని టెక్నాలజీ నిపుణుడు, వ్యూహకర్తయిన సునీల్‌కు తెలీదా? వ్యూహకర్తే పరారీ అయిపోతే ఇక పార్టీని ఏమి అధికారంలోకి తేగలడు?

First Published:  15 Dec 2022 5:47 AM GMT
Next Story