Telugu Global
Telangana

మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలి : మంత్రి హరీశ్ రావు

మూడు పంటల పండించాలని రైతులకు చెబుతూ ధీమా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని హరీశ్ రావు కోరారు.

మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలి : మంత్రి హరీశ్ రావు
X

ఉమ్మడి ఏపీలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఢిల్లీ నగరంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికీ కరెంటు కోతలున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం నాణ్యమైన విద్యుత్ నిరంతరం సరఫరా అవుతోంది. పంటలకు కూడా 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. బాయికాడ మీటర్లు పెడతామని బీజేపీ అంటుంటే.. మూడు గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ మూడు పంటల పండించాలని రైతులకు చెబుతూ ధీమా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని హరీశ్ రావు కోరారు. మూడు గంటల కరెంటు చాలని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లోగా రైతులందరికీ రూ.1 లక్ష రూణ మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి తిప్పలు లేవని.. కేసీఆర్ వల్ల ప్రతీ రైతుకు భరోసా దొరికిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే జిల్లాలోని ఇబ్రహీంనగర్ పెద్ద చెరువు నిండిందని అన్నారు. 30 ఏళ్ల నుంచి ఏనాడూ చెరువు నిండగ చూడలేదని.. ఇక మీరు బతికున్నంత కాలం చెరువు ఎండిపోవడం చూడరని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారిందని అన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పండించిన బియ్యం కావాలని కోరుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగు విరివిగా చేసేందుకు రైతులు ముందుకు వస్తే.. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని చెప్పారు.

ఎన్నికలంటే ఐదేళ్లకోసారి వచ్చే వాళ్ల మోజు, మాయలో పడవద్దని.. కష్టాల్లో ఎప్పుడూ మీ వెంట ఉంటున్న తమను ఆశీర్వదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తనపై ఉంచిన ప్రేమ, ఆదరాభిమానాలను కాపాడుకుంటానని ఆయన భోరోసా ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కావల్సిన పనులను వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

First Published:  14 Aug 2023 12:45 AM GMT
Next Story