Telugu Global
Telangana

మర్రి జంప్.. ఎవరికి నష్టం.. ఎవరికి లాభం

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నయం చేయలేని రోగంతో బాధపడుతోందని అందుకే తాను ఆ పార్టీలో ఉండదలచుకోలేదంటూ ఓ ట్వీట్ చేశారు. ఆయన ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారని అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది.

మర్రి జంప్.. ఎవరికి నష్టం.. ఎవరికి లాభం
X

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత, ఆ పార్టీ అధిష్ఠానానికి వీర విధేయుడిగా చెప్పుకొనే మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడబోతున్నారు. ఈ మేరకు ఆయనే ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నయం చేయలేని రోగంతో బాధపడుతోందని అందుకే తాను ఆ పార్టీలో ఉండదలచుకోలేదంటూ ఓ ట్వీట్ చేశారు. ఆయన ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారని అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది.

గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్లగా.. పార్టీని వీడబోతున్నారంటూ వార్తలు రాగా ఖండించారు. తాజాగా ఆయనే ఒప్పుకోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఆ పార్టీకి ఎంత మేరకు లాభం చేకూరునున్నది అన్న విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ హడావుడి కనిపిస్తున్నప్పటికీ.. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా లేరు. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాత్రం డీలా పడింది. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డి రాకతో నగర పరిధిలో ఓ నియోజకవర్గంలో అభ్యర్థిని వెదుక్కొనే పని బీజేపీకి తప్పనున్నది.

నిజానికి మర్రి శశిధర్ రెడ్డి పెద్దగా మాస్ ఇమేజ్ ఉన్న నేత కారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తనయుడు కావడం.. అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటుండంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం కల్పించింది. కాగా మరి ఆయనను బీజేపీ ఏ విధంగా వాడుకుంటుందో వేచి చూడాలి.

First Published:  19 Nov 2022 10:48 AM GMT
Next Story