Telugu Global
Telangana

కాంగ్రెస్‌ థర్డ్ లిస్ట్‌..కామారెడ్డిలో కేసీఆర్ వర్సెస్ రేవంత్

నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గరపడుతుండడంతో 16 మంది అభ్యర్థులతో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్‌.

కాంగ్రెస్‌ థర్డ్ లిస్ట్‌..కామారెడ్డిలో కేసీఆర్ వర్సెస్ రేవంత్
X

నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గరపడుతుండడంతో 16 మంది అభ్యర్థులతో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది కాంగ్రెస్‌. ఐతే క్రితం ప్రకటించిన రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. మరో నాలుగు స్థానాలు పెండింగ్‌లో ఉంచింది. ఇప్పటివరకు 114 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఒక స్థానం సీపీఐకి కేటాయించింది.

ప్రస్తుతం ప్రకటించిన స్థానాల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. షబ్బీర్‌ అలీకి నిజామాబాద్ అర్బన్ స్థానం కేటాయించింది హస్తం పార్టీ. చెన్నూరు నుంచి బాల్క సుమన్‌పై వివేక్ వెంకటస్వామి పోటీ చేయనున్నారు. పటాన్‌చెరు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు అవకాశమిచ్చింది. జుక్కల్‌ నుంచి తోట లక్ష్మీకాంతరావు, బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ నుంచి పురుమల్ల శ్రీనివాస్, సిరిసిల్లలో కె.కె.మహేందర్ రెడ్డి, నారాయణ ఖేడ్‌ నుంచి సురేష్ షెట్కార్‌, డోర్నకల్ రామచంద్రునాయక్‌, ఇల్లందు కోరం కనకయ్య, వైరా నుంచి మాలోతు రాందాస్‌, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి, అశ్వారావుపేట నుంచి జారె ఆదినారాయణను పోటీలో ఉంచింది.

ఇక గతంలోనే ప్రకటించిన బోథ్‌, వనపర్తి స్థానాల్లో అభ్యర్థులను మార్చింది కాంగ్రెస్. బోథ్‌ అభ్యర్థిగా గతంలో వన్నెల అశోక్‌ను ప్రకటించిన హస్తం పార్టీ ఆయన స్థానంలో అడె గజేందర్‌ను పోటీలో ఉంచింది. ఇక వనపర్తి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డిని తప్పించి మెగా రెడ్డికి అవకాశమిచ్చింది. చేవెళ్ల స్థానంలోనూ అభ్యర్థిని మారుస్తారని తెలుస్తోంది.

ఇక మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సూర్యాపేట, తుంగతుర్తి సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. చార్మినార్ స్థానంలో MIM సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఇక మిర్యాలగూడ విషయంలో సీపీఎంతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మిగిలిన స్థానాలకు రేపో, ఎల్లుండో అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.

First Published:  6 Nov 2023 6:09 PM GMT
Next Story