Telugu Global
Telangana

అదానీతో ఒప్పందంపై ఎట్టకేలకు కాంగ్రెస్ రియాక్షన్..

ఇదెక్కడి డబుల్ గేమ్ అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న వేళ, ఎట్టకేలకు ఆ ఒప్పందంపై కాంగ్రెస్ స్పందించింది.

అదానీతో ఒప్పందంపై ఎట్టకేలకు కాంగ్రెస్ రియాక్షన్..
X

దావోస్ లో అదానీ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. అదే అదానీని గతంలో కాంగ్రెస్ నేతలు చెడామడా తిట్టిన ఉదాహరణలున్నాయి. ఇదెక్కడి డబుల్ గేమ్ అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న వేళ, ఎట్టకేలకు ఆ ఒప్పందంపై కాంగ్రెస్ స్పందించింది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన.. తెలంగాణ అభివృద్ధి కోసమే ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించారు. అయితే ఇప్పటి వరకు అదానీపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు.

బంగారుపళ్లెం కాదు..

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలోపెట్టి కాంగ్రెస్ కి అప్పగించామని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి జూపల్లి స్పందించారు. తెలంగాణ బంగారు పళ్లెం కాదని, అప్పుల కుప్ప అని అన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పు తెలంగాణపై ఉందన్నారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే సరిపోతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత విమర్శిస్తేనే.. పసికందును విమర్శిస్తున్నారా?అని ఎదురు ప్రశ్నించేవారని.. మరిప్పుడు ఆ న్యాయం కాంగ్రెస్ విషయంలో ఎందుకు వర్తించదన్నారు. 2 నెలలు కూడా బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఆగలేకపోతున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరతామన్నారు మంత్రి జూపల్లి.

రెడీగా ఉన్నారు...

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారన్నారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ప్రతినిధులే అవిశ్వాసాలు పెడుతున్నారని, పాలకమండళ్లను పడేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. కృష్ణా బేసిన్‌లో నీరు లేదని, అందుకే రెండో పంటకు నీరివ్వడం సాధ్యం కావడం లేదన్నారు జూపల్లి. సాగునీటి రాజకీయాలు చేయొద్దన్నారు.

First Published:  19 Jan 2024 8:18 AM GMT
Next Story