Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ.. జూన్‌లో 60 మంది అభ్యర్థుల జాబితా

రాష్ట్రంలో పెద్దగా సమస్యలు, వర్గ విభేదాలు లేని 60 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారు. సీనియర్, పాపులర్ నాయకులే ఈ 60 మంది లిస్టులో ఉంటారని తెలుస్తున్నది.

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ.. జూన్‌లో 60 మంది అభ్యర్థుల జాబితా
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతోంది. కర్ణాటక ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్.. తెలంగాణలో కూడా విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్లకు మధ్య ఉన్న విభేదాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఇప్పటికీ సీనియర్లు, కొత్త వాళ్లు ఎవరికి వారే అన్న చందంగానే వ్యవహరిస్తున్నారు. అయినా సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం గెలుపు మాదే అని ధీమాగా చెబుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునిల్ కనుగోలు, ఇతర స్వతంత్ర ఏజెన్సీల ద్వారా పార్టీ రాష్ట్రంలో పలు సర్వేలు చేయించింది. జూన్ నెలలో నియోజకవర్గాల వారీగా మరిన్ని సర్వేలు చేయనున్నది. అది పూర్తయిన తర్వాత 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో119 నియోజకవర్గాలు ఉండగా.. అందులో 50 శాతం సీట్లకు అభ్యర్థులను జూన్‌లోనే ఖరారు చేస్తారని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. అయితే ఈ పేర్లను బహిరంగంగా ప్రకటించరు. కానీ, ఆయా అభ్యర్థులకు ముందుగానే వెల్లడించి.. నియోజకవర్గాల్లో పని చేసుకోమని సూచిస్తారని తెలుస్తున్నది.

రాష్ట్రంలో పెద్దగా సమస్యలు, వర్గ విభేదాలు లేని 60 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారు. సీనియర్, పాపులర్ నాయకులే ఈ 60 మంది లిస్టులో ఉంటారని తెలుస్తున్నది. ఇప్పటికే కీలకమైన నియోజకవర్గాల్లో సర్వేలు పూర్తయ్యాయి. జూన్‌లో మరోసారి ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసి.. అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఎవరైనా సీనియర్ నాయకుడికి ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంటే.. అతడికి అనుకూలమైన నియోజకవర్గాన్ని కేటాయిస్తారని తెలుస్తున్నది. ఈ విషయాలు సదరు అభ్యర్థికి ముందే వివరించి.. ఎందుకు సెగ్మెంట్ మార్పిడి జరిగిందో తెలియజేస్తారు.

కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే వ్యూహం అమలు చేసింది. సీనియర్లను పూర్తిగా తప్పించకుండా.. వారికి అనుకూలమైన నియోజకవర్గంలో టికెట్లు కేటాయించింది. ముందుగానే ఎక్కడి నుంచి టికెట్ కేటాయిస్తున్నామో చెప్పడం ద్వారా ఆ తర్వాత ఎలాంటి గందరగోళం లేకుండా ఉంటుందని పార్టీ అంచనా వేస్తోంది. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం అనంతరం.. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టనున్నది.

రాబోయే రోజుల్లో రాహుల్, ప్రియాంక, మల్లిఖార్జున్ ఖర్గేల పర్యటనలు ఉంటాయని.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా తరచూ తెలంగాణలో జరిగే సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఢిల్లీలో ఎన్నికల జరుగనున్న రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అందులో ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే విషయంపై చర్చించనున్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీలో చాలా విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల లిస్టులో పేర్లు ఉన్నా.. ఆఖరి నిమిషంలో వేరే వారికి కేటాయిస్తుంటారు. ఇప్పుడు ఐదు నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామని పార్టీ చెబుతున్నా.. ఆఖర్లో మార్పులు తప్పవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీనియర్లను బుజ్జగించడానికి మాత్రమే ఈ లిస్టు ప్రకటిస్తున్నారని.. ఎన్నికల సమయంలో అందులో సగానికి పైగా పేర్లు మాయమైనా ఆశ్చర్యపోనక్కరలేదని పార్టీలో చర్చ జరగుతోంది.

First Published:  29 May 2023 5:15 AM GMT
Next Story