Telugu Global
Telangana

ఖమ్మం సభ నుంచే సమర శంఖం

కర్నాటక ఫలితాలు, సీనియర్‌ నేతల చేరికలతో కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ వచ్చింది. దీంతో కర్నాటక వ్యూహానే తెలంగాణలోనూ అమలు చేయాలనుకుంటోంది అధిష్టానం.

ఖమ్మం సభ నుంచే సమర శంఖం
X

అందరికంటే అడుగు ముందుండాలనుకుంటోంది టీ కాంగ్రెస్‌. అందుకే షెడ్యూల్‌కి ముందే ఎన్నిక‌ల‌కు రెఢీ అవుతోంది. జూలై 2న ఖ‌మ్మం స‌భా వేదిక నుంచి రాహుల్ గాంధీ ఎన్నిక‌ల స‌మ‌ర శంఖం పూరించ‌నున్నారు. ఖ‌మ్మం స‌భ‌లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లితో పాటు ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎల్పీ నేత మ‌ల్లు భట్టి విక్రమార్క చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా ఖ‌మ్మం స‌భ ఉంటుంద‌ని నేతలు చెబుతున్నా.. ఈ స‌భ త‌ర్వాత కాంగ్రెస్ యాక్షన్‌ ప్లాన్‌ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఖ‌మ్మం స‌భ ద్వారా ఎన్నిక‌ల కౌంట్ డౌన్ మొద‌లు పెట్టనుంది కాంగ్రెస్. ఖ‌మ్మం సభా వేదిక నుంచి ఎన్నికల హామీలను రాహుల్‌ ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందనే అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ ప్రతి సభలోనూ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేయడం వెనుక బీజేపీతో ఆయనకున్న సంబంధమే కారణమంటున్నారు హస్తం నేతలు. ఈ విషయాలను రాహుల్ గాంధీ నోటి వెంట చెప్పించాలనుకుంటున్నారు.

కర్నాటక ఫలితాలు, సీనియర్‌ నేతల చేరికలతో కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ వచ్చింది. దీంతో కర్నాటక వ్యూహానే తెలంగాణలోనూ అమలు చేయాలనుకుంటోంది అధిష్టానం. అందుకోసం అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని నేతలను ఆదేశించింది. ఇప్పటికీ నేత‌ల మ‌ధ్య అభిప్రాయ బేధాలు బ‌య‌ట ప‌డుతున్నా.. మెజార్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు క‌లసిక‌ట్టుగా ప‌నిచేస్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర తరువాత, ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో రెండు నెల‌ల పాటు సాగిన హాత్ సే హాత్ జోడో అభియాన్, రైతు డిక్లరేష‌న్, యూత్‌ డిక్లరేష‌న్, ద‌శాబ్ది ద‌గా కార్యక్రమాల ద్వారా కేసీఆర్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇదే ఊపులో ఎన్నికల ప్రచారాన్ని మ‌రో స్టేజ్‌కి తీసుకెళ్లేలా 30 ప‌ర్సెంట్ స‌ర్కార్, పే సీఎం వంటి అస్త్రాలను ప్రభుత్వంపైకి విసురుతోంది టీ కాంగ్రెస్‌.

అగ్రనేతల వ‌రుస ప‌ర్యట‌న‌లు కాంగ్రెస్‌కు కలిసొస్తాయని ఆ పార్టీ నేత‌లు న‌మ్ముతున్నారు. వ‌రంగ‌ల్ స‌భ‌లో రాహుల్ గాంధీ విడుద‌ల చేసిన రైతు డిక్లరేష‌న్, హైద‌రాబాద్ స‌భ‌లో ప్రియాంక గాంధీ విడుద‌ల చేసిన యూత్ డిక్లరేష‌న్ ప్రజ‌ల్లో బ‌ల‌మైన ముద్ర వేశాయి. అందుకే కీలక నేతలతో వరుస సభలకు కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తోంది. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ, డీకే శివకుమార్‌ వంటి నేతలతో దాదాపు 50 సభలను ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో సభలు, రోడ్ షోల నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టారట. కాసింత గట్టి ప్రయత్నం చేస్తే తెలంగాణలో అధికారం దక్కించుకోవడం ఖాయమని కాంగ్రెస్‌ భావిస్తోంది. మరి హస్తం వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి.

First Published:  30 Jun 2023 6:33 AM GMT
Next Story