Telugu Global
Telangana

పొత్తులకు స్వాగతం.. మునుగోడులో రేవంత్ రెడ్డి ప్రచారం..

రేవంత్ రెడ్డి కమ్యూనిస్ట్ ల సహకారం కోరే సమయానికి సీపీఐ నేతలు ఆల్రడీ టీఆర్ఎస్ స్టాండ్ తీసుకున్నారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు వారు టీఆర్ఎస్ కి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. ఇక రేవంత్‌రెడ్డి ఆశ కోదండరాంపైనే ఉంది.

పొత్తులకు స్వాగతం.. మునుగోడులో రేవంత్ రెడ్డి ప్రచారం..
X

జూమ్ మీటింగ్ ద్వారా నిన్న లాంఛనంగా మునుగోడు నేతలతో మాట్లాడి ప్రచార పర్వాన్ని ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నారాయణ పురం మండలం పొర్లగడ్డ తండాలో పర్యటించారు. కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మునుగోడులో కమ్యూనిస్ట్ లు, కోదండరాం.. కాంగ్రెస్ కి సహకరించాలని కోరారు రేవంత్ రెడ్డి. కమ్యూనిస్ట్ ల ఖిల్లా నల్లగొండ జిల్లా అంటూ ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, మునుగోడు ఉప ఎన్నికలో పొత్తులకు తెరలేపే ప్రయత్నం చేశారు.

టూ లేట్..

రేవంత్ రెడ్డి కమ్యూనిస్ట్ ల సహకారం కోరే సమయానికి సీపీఐ నేతలు ఆల్రడీ టీఆర్ఎస్ స్టాండ్ తీసుకున్నారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు వారు టీఆర్ఎస్ కి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. ఇక రేవంత్‌రెడ్డి ఆశ కోదండరాంపైనే ఉంది. కోదండరాం మద్దతుతో కాంగ్రెస్ కి గొప్పలాభం చేకూరుతుందని కాదు కానీ, ఉద్యమ నేపథ్యం ఉన్న నేత కలుపుకొని వెళ్తే.. పార్టీకి నైతిక బలం చేకూరుతుందనేది రేవంత్ రెడ్డి ఆలోచన.

అమ్ముడుపోతున్నవారికి గుణపాఠం చెప్పండి..

ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజాప్రతినిధులు అమ్ముడుపోతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. వారికి సరైన గుణపాఠం చెప్పాలని, ప్రజల్లోకి వస్తే వారిని నిలదీయాలని రేవంత్ రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కారమయ్యే వరకు కలిసి పోరాడదామన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ పెద్దల్ని సైతం రంగంలోకి దింపుతానని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో మన మునుగోడు - మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. ప్రతి గ్రామంలో కరపత్రాలు అంటించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మునుగోడులో వామపక్షాల ఓట్లు కీలకం కాగా.. ఇప్పటికే సీపీఐ టీఆర్ఎస్ కి మద్దతివ్వడంతో కాంగ్రెస్ కాస్త డైలమాలో పడింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ కి ఉన్న ఓటుబ్యాంక్ తోపాటు, టీడీపీకి ఉన్న ఓటుబ్యాంక్ ని కూడా తమవైపు తిప్పుకోవాలనుకుంటోంది.

First Published:  20 Aug 2022 1:30 AM GMT
Next Story