Telugu Global
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్వే.. దాని ఆధారంగానే టికెట్ల కేటాయింపు?

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే టికెట్లు ప్రకటించాలని సీనియర్లు కోరుతున్నారు. 119 నియోజకవర్గాలకు గాను కనీసం 70 సీట్లకైనా ముందస్తు అభ్యర్థులను ప్రకటిస్తే పార్టీకి లాభం చేకూరుతుందని చెబుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్వే.. దాని ఆధారంగానే టికెట్ల కేటాయింపు?
X

కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి దాదాపు 9 ఏళ్లు అవుతోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసలు జాడే లేకుండా పోయింది. తెలంగాణలో మాత్రమే కాస్తో కూస్తో సీట్లు సంపాదిస్తోంది. ఇక అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలకు తక్కువేం లేదు. టీపీసీసీలో కూడా గత కొన్నాళ్లుగా సీనియర్లు, రేవంత్ రెడ్డి వర్గం మధ్య విభేదాలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని నెలలే సమయం ఉండటంతో కాంగ్రెస్ నాయకుల దృష్టి టికెట్ల కేటాయింపుపై పడింది.

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే టికెట్లు ప్రకటించాలని సీనియర్లు కోరుతున్నారు. 119 నియోజకవర్గాలకు గాను కనీసం 70 సీట్లకైనా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే పార్టీకి లాభం చేకూరుతుందని చెబుతున్నారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజలకు దగ్గర అవడమే కాకుండా, ఇతర వనరులు కూడా సమకూర్చుకోవడానికి సమయం ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం అంత సులభమైన విషయం కాదని, సీఎం కేసీఆర్ వ్యూహాలను కూడా ఎదుర్కోవాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని టీపీసీసీలో చర్చ జరుగుతున్నది.

బీఆర్ఎస్ పార్టీ ఎలాగో దాదాపు సిట్టింగులకే సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నది. అదే సమయంలో ప్రతీ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాళ పేరుతో ఇప్పటికే కార్యకర్తలను ఎన్నికల మూడ్‌లోకి తీసుకొని పోతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల కోసం ముందుగానే సిద్ధపడితే మంచిదని భావిస్తున్నారు. గతంలో వరంగల్‌లో రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరు నెలల ముందుగానే టికెట్లు ప్రకటించాలని కోరారు. అలా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయని సూచించారు.

రాష్ట్రంలో 30 నుంచి 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి బలమైన సీనియర్ నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, టి. జయప్రకాశ్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జే. గీతారెడ్డి, పద్మావతీ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, సీతక్క, దామోదర్ రెడ్డి, కొండా సురేఖ, డి. శ్రీధర్ బాబు, జానారెడ్డి వంటి వారికి టికెట్లు దాదాపు ఖాయమే. వీళ్లతో పాటు మరి కొందరికి ముందస్తుగానే టికెట్లు ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ కోరుతోంది.

ఇప్పటికే కొంత మంది సీనియర్లు ముందస్తు టికెట్ల కేటాయింపు విషయంపై అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే, సెగ్మెంట్ల వారీగా సర్వే నిర్వహించిన తర్వాతే ఎవరికి టికెట్లు కేటాయించాలో నిర్ణయిస్తామని చెప్పినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునిల్ కనుగోలు ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. వీళ్లతో పాటు అధిష్టానం సొంతగా మరో సర్వే చేయించనున్నట్లు తెలుస్తున్నది. అందులో వచ్చిన డేటా ప్రకారం ముందస్తుగా ఎవరికి టికెట్లు కేటాయించాలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  2 April 2023 4:46 AM GMT
Next Story