Telugu Global
Telangana

కుట్రలు కనిపెట్టలేకపోతే బలైపోతాం జాగ్రత్త -రేవంత్ రెడ్డి

ఎన్నికల వేళ టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలసి కాంగ్రెస్ ని అంతం చేయాలని కుట్రలు పన్నుతున్నాయని వివరించారు రేవంత్ రెడ్డి. అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్ ఉనికే ప్రమాదంలో పడే అవకాశముందన్నారు.

కుట్రలు కనిపెట్టలేకపోతే బలైపోతాం జాగ్రత్త -రేవంత్ రెడ్డి
X

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారిగా కీలక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అనుబంధ సంఘాల నేతలకు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. వారి ట్రాప్ లో పడితే బలైపోతాం జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఎన్నికల వేళ టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలసి కాంగ్రెస్ ని అంతం చేయాలని కుట్రలు పన్నుతున్నాయని వివరించారు. అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్ ఉనికే ప్రమాదంలో పడే అవకాశముందని అన్నారాయన.

అందరూ సమానమే..

ఇటీవల కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు మరింత పెరిగింది. పార్టీపై రేవంత్ రెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న చాలామంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలను అధిష్టానానికే వదిలిపెట్టారు రేవంత్ రెడ్డి. ఆమధ్య కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపడంతో ఇప్పుడాయన అందర్నీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది లేదని, అందరూ సమానమేనని, అందరం సహచరులమేనని స్పష్టం చేశారు. "మన మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ, టీఆర్ఎస్ అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయి, అలాంటి పార్టీలను ఓ కంట కనిపెట్టాలి" అని సూచించారు రేవంత్ రెడ్డి.

ఎన్నికలకు సిద్ధం కండి..

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు రేవంత్ రెడ్డి. గతంలో అనుబంధ సంఘాలకు అప్పగించిన కార్యక్రమాల పురోగతి అడిగి తెలుసుకున్నారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనుబంధ సంఘాలు అప్రమత్తంగా వ్యవహరించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, అజారుద్దీన్, కోదండ రెడ్డి, మల్లు రవి తదితరలు పాల్గొన్నారు.

First Published:  21 Nov 2022 11:51 AM GMT
Next Story