Telugu Global
Telangana

అసంతృప్తులతో కలసిపోయారు..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అలా ఎందుకు తిట్టించారని ప్రశ్నించారు శశిధర్ రెడ్డి. జానారెడ్డి, ఉత్తమ్ లాంటి వాళ్లను కూడా రేవంత్ రెడ్డి తిట్టిస్తే ఎలా అని ప్రశ్నించారు.

అసంతృప్తులతో కలసిపోయారు..
X

కాంగ్రెస్ పార్టీలో తాజాగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా, వెంకట్ రెడ్డిపై జరుగుతున్న మాటలదాడితో మరోసారి శశిధర్ రెడ్డి బయటకొచ్చారు. సీనియర్లందర్నీ హోమ్ గార్డ్ లతో పోలుస్తున్నారని, అంటే హోమ్ గార్డ్ లకు ఇక ప్రమోషన్లు ఉండవని చెప్పిస్తున్నారా అని ప్రశ్నించారు. నేరుగా కాంపిటేటివ్ పరీక్ష రాసి ఐపీఎస్ పాసై వచ్చినట్టు రేవంత్ రెడ్డి పీసీసీ సీట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న నాయకులంతా కాంగ్రెస్ కి హోమ్ గార్డులేనన్నారు శశిధర్ రెడ్డి.

రేవంత్ పై ధ్వజం..

రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు సమాంతరంగా మరో ఆఫీస్ నడుపుతున్నారని, తనకి ఎదురు తిరుగుతారు, కాంగ్రెస్ లో సీనియర్లు అనుకున్నవారందరిపై ఆరోపణలు చేయిస్తున్నారని, తిట్టిస్తున్నారని, అధిష్టానానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అలా ఎందుకు తిట్టించారని ప్రశ్నించారు శశిధర్ రెడ్డి. జానారెడ్డి, ఉత్తమ్ లాంటి వాళ్లను కూడా రేవంత్ రెడ్డి తిట్టిస్తే ఎలా అని ప్రశ్నించారు.

వాళ్లిద్దరూ వేస్ట్..

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉన్న మాణిక్కం ఠాగూర్, తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న కేసీ వేణుగోపాల్ ని కూడా రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు శశిధర్ రెడ్డి. రేవంత్ కి ఠాగూర్ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ తోనే రాజకీయం మొదలు పెట్టిన సీనియర్ నేతలపై, నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే సిగ్గుగా ఉందన్నారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఆయన అన్న మాటలు ఎక్కడికిపోతాయన్నారు శశిధర్ రెడ్డి.

రాహుల్ అంత మాట అంటారా..?

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నుంచి రేవంత్ మినహా ఇంకెవరూ రాహుల్ గాంధీని కలిసే పరిస్థితి లేదని, అందుకే ఆయన చెప్పిందే వేదం అవుతోందన్నారు శశిధర్ రెడ్డి. వరంగల్ సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆయన తప్పుబట్టారు. పార్టీలో ఎంత సీనియర్లు అయినా ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళండి అంటూ రాహుల్ తమని తక్కువచేసి మాట్లాడారని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగాలా..? లేక విశ్రాంతి తీసుకోవాలా అనే విషయాన్ని ఆలోచిస్తున్నానని చెప్పారు శశిధర్ రెడ్డి.

First Published:  18 Aug 2022 1:39 AM GMT
Next Story