Telugu Global
Telangana

మొన్న, నిన్న, నేడు.. కాంగ్రెస్‌లో కొట్టుకున్నోళ్లకు కొట్టుకున్నంత!

వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో చేరికల చిచ్చు రాజుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్‌చల్‌ చేశారు.

మొన్న, నిన్న, నేడు.. కాంగ్రెస్‌లో కొట్టుకున్నోళ్లకు కొట్టుకున్నంత!
X

ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కొట్లాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మొన్న వరంగల్‌, నిన్న గద్వాల, తాజాగా వనపర్తిలో హస్తం నేతలు కుస్తీకి దిగారు. ఎంపీ ఎన్నికల్లో 14సీట్లు గెలుస్తామని కాంగ్రెస్‌పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చిన నియోజకవర్గాల్లో సొంత క్యాడర్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు అనుకూలంగా సర్వేల ఫలితాలు రావడం కాంగ్రెస్‌ను మరింత కలవరపెడుతోంది.

తాజాగా వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో చేరికల చిచ్చు రాజుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్‌చల్‌ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు, మాజీ సర్పంచ్‌ గణేష్‌గౌడ్ అనుచరులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకోవడమే కాకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించి నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

నిన్నటికి నిన్న గద్వాల కాంగ్రెస్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పరస్పరం దాడి చేసుకున్నాయి. గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీలు సరిత, సంపత్‌కుమార్, ఎంపీ అభ్యర్థి మల్లు రవి సమక్షంలోనే హస్తం నేతలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దాడిలో సీనియర్ నేత బండ్ల చంద్రశేఖర్‌రెడ్డికి తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యారు.

వరంగల్‌లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. కడియం శ్రీహరి ఎక్కడ మీటింగ్‌ పెట్టినా ఆయనకు పరాభవమే ఎదురవుతోంది. వరంగల్, పరకాల మీటింగుల్లో కడియం ముందే కార్యకర్తలు రెండు గ్రూపులుగా దిగి కొట్టుకున్నారు. దీంతో చేసేదేంలేక వరంగల్ ఎంపీ అభ్యర్థి కావ్య, కడియం శ్రీహరి మీటింగ్ మధ్యలోంచే వెళ్లిపోయిన పరిస్థితి. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఈస్థాయిలో ఉంటే.. ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ జోరందుకుంది.

First Published:  18 April 2024 9:52 AM GMT
Next Story