Telugu Global
Telangana

పరువు, ప్రతిష్ట, ఓ ఎమ్మెల్యే సీటు..

ఇప్పుడు 2022లో జరగాల్సిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీటుని బీజేపీ, టీఆర్ఎస్ ఆశిస్తున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ కి గెలుపు అత్యవసరం. అందుకే మిగతా పార్టీలకంటే ఇది కాంగ్రెస్ కే ఎక్కువ ప్రతిష్టాత్మకంగా మారింది.

పరువు, ప్రతిష్ట, ఓ ఎమ్మెల్యే సీటు..
X

పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంలా ఉంది మునుగోడు అసెంబ్లీ సీటు పరిస్థితి. అయితే ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ రెండిటి వ్యవహారం పిల్లుల లాగా ఉంది. మధ్యలో కాంగ్రెస్ ఎలుకలా మారింది. వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ సీటు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారు. అధికార టీఆర్ఎస్ కూడా ఈ సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మధ్యలో కాంగ్రెస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోడానికి అష్టకష్టాలు పడుతోంది. అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిసైడ్ చేసేందుకు రెడీ అయింది. మునుగోడు ఉప ఎన్నికలపై ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సమీక్ష జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ సెక్రటరీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మేథో మధనం..

2018లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాక, ఏడాది గ్యాప్‌లో 2019లో హూజూర్‌నగర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సీటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌కి వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడు ఉప ఎన్నికలు జరుగగా రెండు టీఆర్ఎస్ చేతిలో నుంచి బీజేపీకి, ఒకటి టీఆర్ఎస్.. త‌న సీటును తాను నిల‌బెట్టుకుంది. ఇప్పుడు 2022లో జరగాల్సిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీటుని బీజేపీ, టీఆర్ఎస్ ఆశిస్తున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ కి గెలుపు అత్యవసరం. అందుకే మిగతా పార్టీలకంటే ఇది కాంగ్రెస్ కే ఎక్కువ ప్రతిష్టాత్మకంగా మారింది.

ఎవరు గెలిస్తే వారికి నైతిక బలం..

2018 తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోల్పోవడమే కానీ, గెలుచుకుంది లేదు. ఫిరాయింపుల ద్వారా 12మంది వెళ్లిపోయారు. హుజూర్ నగర్ సీటు చేజారింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పర్ఫామెన్స్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. 2024లో అధికారం మాదేనంటూ ఢంకా భజాయిస్తున్న హస్తం పార్టీ నేతలు ఎన్నికలకు ఏడాది ముందు జరిగే ఉప ఎన్నికల్లో సత్తా చూపితేనే పరువు దక్కుతుంది. ఆమధ్య హుజూరాబాద్ లో బీజేపీ గెలిచినా, టీఆర్ఎస్ ని ఓడించామని సంబరపడ్డారు కాంగ్రెస్ నేతలు. కానీ మునుగోడు కాంగ్రెస్ సీటు, ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే సంబర పడాలనుకున్నా, విజయం బీజేపీకి దక్కితే కాంగ్రెస్ పరువుపోతుంది. అందుకే రాష్ట్ర అధినాయకత్వం తిప్పలు పడుతోంది. అందరికంటే ముందుగా హడావిడి మొదలు పెట్టింది. దీనికి ఫలితం ఎంతమేరకు ఉంటుందో వేచి చూడాలి.

First Published:  11 Aug 2022 10:29 AM GMT
Next Story