Telugu Global
Telangana

ఈటలకు కాంగ్రెస్ ఆఫర్‌.. సోషల్‌మీడియాలో ఊహాగానాలు!

ఈటల రాజేందర్ బీజేపీ నుంచి మెదక్‌, మల్కాజ్‌గిరి స్థానాలు ఆశిస్తున్నారని తెలుస్తోంది. కానీ, మెదక్ నుంచి రఘునందన్ రావు, మల్కాజ్‌గిరి నుంచి మురళీధర్‌ రావు సహా పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు.

ఈటలకు కాంగ్రెస్ ఆఫర్‌.. సోషల్‌మీడియాలో ఊహాగానాలు!
X

మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్‌ గాలం వేస్తోందా..? ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించి, ఎంపీ సీటు ఇచ్చేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా..? ఇప్పుడు ఇదే చర్చ సోషల్‌మీడియాలో నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ ఈటల ఓడిపోయారు. దీంతో ఆయన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. బీజేపీలో పార్లమెంట్ స్థానాలకు ఉన్న పోటీ దృష్ట్యా ఆయనకు సీటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 10కి పైగా స్థానాలు గెలవాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలో ఉంచాలని ప్లాన్ చేస్తోంది. కరీంనగర్‌లో గతంలో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ స్థానం నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ కొత్త అభ్యర్థిని నిలబెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈటలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీటు ఆఫర్ చేస్తున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌కు కరీంనగర్ జిల్లాపై పట్టు ఉండడం, ఆయన అనుభవం పార్టీకి కలిసొస్తుంద‌ని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈటల రాజేందర్ బీజేపీ నుంచి మెదక్‌, మల్కాజ్‌గిరి స్థానాలు ఆశిస్తున్నారని తెలుస్తోంది. కానీ, మెదక్ నుంచి రఘునందన్ రావు, మల్కాజ్‌గిరి నుంచి మురళీధర్‌ రావు సహా పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈ రెండు స్థానాలు ఆయనకు దక్కే అవకాశాలు లేవు. ఇక బీజేపీలోనూ మాజీ బీజేపీ స్టేట్ చీఫ్‌ బండి సంజయ్‌తో ఆయనకు విబేధాలున్నాయని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకున్నా.. ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉంటారా..? ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

First Published:  27 Dec 2023 3:58 PM GMT
Next Story