Telugu Global
Telangana

ED నోటీసులు అందుకున్న టీ కాంగ్రెస్ నేతల‌కు అధిష్ఠానం పిలుపు!

ఈడీ నోటీసులు అందుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు ఈ రోజు ఢిల్లీ చేరుకున్నారు.

ED నోటీసులు అందుకున్న టీ కాంగ్రెస్ నేతల‌కు అధిష్ఠానం పిలుపు!
X

నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పార్టీలో అనేక మందికి చుట్టుకుంటోంది. ఆ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను అనేక గంటలపాటు ప్రశ్నించిన‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఇంకా అనేక మంది కాంగ్రెస్ నాయకులకు నోటీసులను జారీ చేసింది. అందులో భాగంగా తెలంగాణకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల‌కు కూడా నోటీసులు జారీ చేసింది. అక్టోబ‌ర్ 10న ఢిల్లీలోని త‌మ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ వీరిని ఈడీ ఆదేశించింది.

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఈడీ ఢిల్లీ కార్యాల‌యానికి పిలిచిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఆ ఐదుగురినీ ఈ రోజు ఢిల్లీకి రావాలని ఆదేశించింది. వీరిలో కొంద‌రు గురువారం రాత్రికే ఢిల్లీ చేరుకోగా... మ‌రికొంద‌రు శుక్ర‌వారం ఉద‌యం హ‌స్తిన చేరారు.

వీరందరికీ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి పూర్వాపరాలు వివరించనున్నట్టు సమాచారం. అలాగే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అడిగిన ప్రశ్నలేంటి ? వీరికి ఏ ప్రశ్నలు ఎదురు కావచ్చు తదితర విషయాలపై ఈ ఐదుగురికి అవగాహన కల్పించే అవకాశం ఉంది. అలాగే పార్టీకి చెందిన ఆడిటర్లతో కూడా ఈ ఐదుగురికి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

Next Story