Telugu Global
Telangana

రేపు ప్ర‌ధానితో కాంగ్రెస్ ఎంపి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి భేటీ..కార‌ణ‌మ‌దేనా..!?

గ‌త కొంత‌కాలంగా వెంక‌ట‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై అసంతృప్తితో ఉంటున్న విష‌యం తెలిసిందే. దానికి తోడు మునుగోడు ఉపఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన అనేక ప‌రిణామాలు ఆయ‌న కాంగ్రెస్ లో కొన‌సాగే అంశాన్ని ప్ర‌శ్నార్ధ‌కం చేశాయి.

రేపు ప్ర‌ధానితో కాంగ్రెస్ ఎంపి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి భేటీ..కార‌ణ‌మ‌దేనా..!?
X

శుక్ర‌వారంనాడు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో స‌మావేశం కానున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల రాజ‌కీయ ప‌రిణామాల మ‌ధ్య వీరిరువురూ స‌మావేశం కానుండ‌డం ఆస‌క్తి రేపుతోంది. భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌కు సంబంధించి ప్ర‌ధానితో చ‌ర్చించేందుకే స‌మావేశ‌మ‌వుతున్నార‌ని చెబుతున్న‌ప్ప‌టికీ వెంక‌ట‌రెడ్డి ఆంత‌ర్యం ఏమై ఉంటుంద‌నే ఊహాగానాలు బ‌య‌లుదేరాయి.

గ‌త కొంత‌కాలంగా వెంక‌ట‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై అసంతృప్తితో ఉంటున్న విష‌యం తెలిసిందే. దానికి తోడు మునుగోడు ఉపఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన అనేక ప‌రిణామాలు ఆయ‌న కాంగ్రెస్ లో కొన‌సాగే అంశాన్ని ప్ర‌శ్నార్ధ‌కం చేశాయి. పైగా ఆయ‌న సోద‌రుడు రాజ‌గోపాల రెడ్డి బిజెపి అభ్య‌ర్ధిగా పోటీ చేసి ఓడిపోవ‌డం, ఆయ‌న‌కే ఓటువేయాలంటూ వెంక‌ట‌రెడ్డి చెప్పిన‌ట్టు ఉన్న వీడియో బ‌య‌టికి రావ‌డం, కాంగ్రెస్ గెల‌వ‌ద‌నే వ్యాఖ్య‌లు చేశార‌నే వార్త‌ల‌తో కాంగ్రెస్ అధిష్టానం ఆయ‌న‌కు షోకాజు నోటీసులు జారీ చేసింది. దానిపై తాను స‌మాధానం ఇచ్చాన‌ని ఎంపీ చెప్పిన‌ప్ప‌టికీ ఏం చెప్పార‌నే విష‌యం మాత్రం బ‌య‌టికి రాలేదు. దీనికి తోడు పిసిసి కి కొత్త‌గా ఏర్పాటు చేసిన క‌మిటీల‌లో కూడా వెంక‌ట‌రెడ్డి కి చోటు ద‌క్క‌లేదు. దీనిపై కూడా ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సీఎల్పీనేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో భేటీకావాల‌ని భావించారు. క‌మిటీల నియామ‌కాల విష‌యంలో భ‌ట్టి తో పాటు మ‌రికొంద‌రు నాయ‌కులు కూడా అసంతృప్తితో ఉన్న విష‌యం తెలిసిందే.

ఈ ప‌రిస్థితుల న‌డుమ వెంక‌ట‌రెడ్డి నిన్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేతో ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితితో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించారు. వీరి మ‌ధ్య‌లో ఇంకా ఏయే అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింద‌నే దానిపై వివ‌రాలు వెల్ల‌డ‌వ‌లేదు. అయితే క‌మిటీల నియామ‌కాల అంశంతో పాటు రేవంత్ రెడ్డి పని తీరుపైన కూడా ఎఐసిఐసి అధ్య‌క్షుడితో చ‌ర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందే తాను రాజకీయాల గురించి మాట్లాడుతానని మూడు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా చెబుతున్నారు.

పైకి చెబుతున్న‌దాన్ని బ‌ట్టి వెంక‌ట‌రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని అభివృద్ధి ప‌నుల గురించి ప్ర‌ధానితో చ‌ర్చించనున్నార‌ని స‌మాచారం. ప్ర‌ధానంగా మూసీ నదీ ప్రక్షాళనతో పాటు విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనుల విషయమై కూడా ప్రధానితో వెంకట్ రెడ్డి చర్చించనున్నారు. ఎంఎంటీసీ, మెట్రో రైలు పనులపై కూడ వెంకట్ రెడ్డి చర్చించనున్నారుట‌.

First Published:  15 Dec 2022 10:57 AM GMT
Next Story