Telugu Global
Telangana

కడియం కూతురుకు సైబర్ వల.. చివర్లో ట్విస్ట్‌ అదిరిపోలా!

ఫోన్ కాల్ నిజమేనా, లేక మోసగాళ్ల పనా? అని నిర్దారించుకునేందు కడియం శ్రీహరి గాంధీ భవన్‌కు ఫోన్ చేశారు. మాకు గాంధీ భవన్‌ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి డబ్బులు అడిగారు. ఇది నిజమేనా అని గాంధీభవన్‌ వర్గాలను కడియం ఆరా తీశారు.

కడియం కూతురుకు సైబర్ వల.. చివర్లో ట్విస్ట్‌ అదిరిపోలా!
X

సైబర్‌ నేరగాళ్లకు లూటీ చేయడం ఒకటే టార్గెట్. వాళ్లు పెద్దవాళ్లా, చిన్నవాళ్లా ఇవేమీ చూడరు. చాన్స్ దొరికిందంటే ఎంత పెద్ద మొత్తమైనా క్షణాల్లో లేపేస్తారు. పెరుగుతున్న టెక్నాలజీని వాడుకుంటూ విజృంభిస్తున్నారు. సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా తరచూ సైబర్‌ నేరగాళ్ల వ‌ల‌లో పడి మోసపోయిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు కూడా సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు.

మ్యాటర్‌లోకి వెళ్తే.. పక్కా ప్లాన్‌ ప్రకారం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల్ని టార్గెట్ చేశారు సైబర్‌ నేరగాళ్లు. నేతల నుంచి డబ్బులు దండుకునేందుకు పకడ్బందీగా స్కెచ్ గీశారు. అసలేం జరిగిందంటే.. కడియం శ్రీహరి కూతురు కావ్యకు సైబర్‌ నేరగాళ్లు కాల్ చేశారు. "మేం గాంధీ భవన్‌ నుంచి ఫోన్ చేస్తున్నాం. అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో భాగంగా మీరు 76వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మేం చెప్పిన ఈ స్కానర్‌కు అమౌంట్‌ పంపించండి" అని అవతలి వ్యక్తులు కావ్యకు చెప్పారు. అనుమానం వచ్చిన కావ్య.. తండ్రి కడియం శ్రీహరికి విషయం చెప్పారు.

ఫోన్ కాల్ నిజమేనా, లేక మోసగాళ్ల పనా? అని నిర్దారించుకునేందు కడియం శ్రీహరి గాంధీ భవన్‌కు ఫోన్ చేశారు. మాకు గాంధీ భవన్‌ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి డబ్బులు అడిగారు. ఇది నిజమేనా అని గాంధీభవన్‌ వర్గాలను కడియం ఆరా తీశారు. అబ్బే అలాంటిదేం లేదని అక్కడి సిబ్బంది క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇది సైబర్‌ నేరగాళ్ల పనే అని కడయం శ్రీహరి నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ ప్రశ్నేంటంటే కడియం కావ్య నంబర్ సైబర్ నేరగాళ్లకు ఎలా చేరింది అని. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సైబర్‌ నేరగాళ్లు ఎంపీ అభ్యర్థుల వివరాల్ని కూడా గాంధీభవన్‌ నుంచే తీసుకోవడం విశేషం.

ఎంపీ అభ్యర్థులకు ఎలాగైతే తాము గాంధీ భవన్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి డబ్బులు గుంజేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నించారో సేమ్ అదే ట్రిక్ గాంధీ భవన్‌ సిబ్బంది దగ్గర కూడా ప్లే చేశారు. గాంధీ భవన్‌కు ఫోన్ చేసి తాము ఏఐసీసీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఎంపీ అభ్యర్థుల వివరాలు తీసుకున్నారు. సిబ్బంది ఇచ్చిన వివరాల ఆధారంగానే ఎంపీ అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం కడియం కావ్య బయటపడ్డారు. ఇంకెంత మంది అభ్యర్థులకు ఫోన్లు వచ్చాయి అనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  4 April 2024 5:38 AM GMT
Next Story