Telugu Global
Telangana

ఇంతకు ఏం చెప్పి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓట్లడుగుతారు?

తన సొంత ప్రయోజనాలు, వ్యాపార అవసరాల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ పంచన చేరారనే విషయం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మరి ఏ కారణం చెప్పి ఆయన మునుగోడు ప్రజలను ఓట్లు అడుగుతారనే అనుమానం నెలకొంది.

ఇంతకు ఏం చెప్పి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓట్లడుగుతారు?
X

తెలంగాణలో ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉపఎన్నిక తీసుకురావాలన్న బీజేపీ ప్లాన్ సక్సెస్ అయ్యింది. నాలుగైదు నెలలు రాజీనామాపై ఊరించి.. తీరిగ్గా పార్టీ మారదామనకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. దీంతో అప్పటికప్పుడు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. తాను వెళ్తే తప్పకుండా సహకరించాలని వారిని రాజగోపాల్ రెడ్డి కోరారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారనే విషయంపై మాత్రం ప్రెస్‌ మీట్‌లో స్పష్టత ఇవ్వలేకపోయారు.

Advertisement

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో విభేదాల కారణంగానే పార్టీని వీడుతున్నానని ఒకసారి, అధికార టీఆర్ఎస్ మునుగోడుకు నిధులు ఇవ్వడం లేదని మరోసారి, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోడీ, అమిత్ షాల వల్లే అవుతుందంటూ ఒకసారి వ్యాఖ్యలు చేశారు. అసలు తాను ఎందుకు రాజీనామా చెయ్యాల్సి వచ్చిందన్న విషయంపై రాజగోపాల్ రెడ్డికే స్పష్టత లేకపోవడం.. పూటకో మాట చెప్పడం కాంగ్రెస్ వర్గాలనే కాకుండా మునుగోడు ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

Advertisement

తన సొంత ప్రయోజనాలు, వ్యాపార అవసరాల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ పంచన చేరారనే విషయం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మరి ఏ కారణం చెప్పి ఆయన మునుగోడు ప్రజలను ఓట్లు అడుగుతారనే అనుమానం నెలకొంది. బీజేపీకి ఈ ఉపఎన్నిక గెలిస్తే లాభమే. కానీ అదే సమయంలో ఓడిపోతే అది బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపదు. పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా చాలా డ్యామేజ్ చేస్తుంది. దుబ్బాకలో రఘునందన్ రావు, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ వ్యక్తిగత ఈమేజీలతోనే గెలిచారు. కానీ అంతిమంగా బీజేపీ ఆ విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మునుగోడు విషయంలోనూ బీజేపీ అదే చూసుకుంటోంది. రాజగోపాల్ రెడ్డి పరిచయాలు, చరిష్మాతో మునుగోడులో గెలిచి దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని భావిస్తోంది.

అయితే ఇప్పుడు అందరికీ ఒకటే అనుమానం. అసలు రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పి మునుగోడు ప్రజల నుంచి ఓట్లడుగుతారు అనేదే. అధికార టీఆర్ఎస్ పార్టీ తాము చేపట్టిన పథకాలు, భవిష్యత్ ప్రయోజనాలను చూపించి ఓట్లడుగుతుంది. తెలంగాణ ఇచ్చింది మేమేనని.. సోనియాను, పార్టీని మోసం చేసి రాజగోపాల్ వెళ్లిపోయాడనే సెంటిమెంట్ కాంగ్రెస్ ప్లే చేసుకునే అవకాశం ఉంది. రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచాడనే చెప్పుకునేందుకు కాంగ్రెస్‌కు అర్హత ఉంది. మరి బీజేపీ, రాజగోపాల్ ఏం చెప్పుకొని ఓట్లు అడుగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను అభివృద్ధి చేసింది బీజేపీ అని చెప్పుకుందామంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా కళ్ల ముందు కనపడటం లేదు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎలా రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించారో నిత్యం కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు. గెలిచిన తర్వాత రఘునందన్, ఈటెల ఆయా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఇప్పటికే టీఆర్ఎస్ ప్రచారం మొదలు పెట్టింది. ఇలా ముప్పేటలా రాజగోపాల్‌పై దాడి చేస్తుంటే ఆయనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

తెలంగాణలో బీజేపీకి సరైన అభ్యర్థులు లేరన్నది వాస్తవం. అందుకే ఇతర పార్టీల నాయకుల చరిష్మా మీదనే ఎప్పుడూ గెలుస్తూ వస్తోంది. నిజంగా బీజేపీ అంత బలంగా ఉంటే హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో కూడా గెలిచి ఉండాల్సింది. కానీ కేవలం దుబ్బాక, హుజూరాబాద్ విజయాలను మాత్రం చూపించి... తాము బలంగా ఉన్నామనే ఫీలర్లు వదలడం తప్ప బీజేపీ చేసేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేవలం ఒక ఉపఎన్నిక తీసుకొచ్చి టీఆర్ఎస్, కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలనే విషయంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. కానీ గతంలో మాదిరిగా ఈ ఉప ఎన్నిక మాత్రం అంత ఈజీగా ఉండదని, ముఖ్యంగా రాజగోపాల్‌పై పెద్దగా సానుభూతి కూడా లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Next Story