Telugu Global
Telangana

ఎన్ని ఆటలాడినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని, అధికారంలోకి రావడానికి ఎన్ని పాట్లు పడినా అది అసాధ్యమేనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.

ఎన్ని ఆటలాడినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
X

ఎన్ని ఆటలు ఆడినా తెలంగాణ బీజేపీ అధికారంలోకి రాలేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని, అధికారంలోకి రావడానికి ఎన్ని పాట్లు పడినా అది అసాధ్యమేనని ఆయన తేల్చి చెప్పారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయని.. అయితే వాటిని ఒప్పుకోవడానికి మాత్రం ముందుకు రారని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, గవర్నర్ వ్యవహార తీరు నేపథ్యంలో కేంద్రం తమిళిసైని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు కాంగ్రెస్ చరిత్ర కంటే బీజేపీ చరిత్రే ఎక్కువ తెలుసని చెప్పుకొచ్చారు. అందుకే బీజేపీ ఎలా స్పందిస్తుందో ముందుగానే అర్థం అవుతుందని ఆయన తెలిపారు.

Advertisement

అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గవర్నర్ ఒక్క సారిగా సైలెంట్ అయిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. పులిలాగ బయట గాండ్రించి.. పిల్లిలాగ అసెంబ్లీలో మాట్లాడారని గవర్నర్ తీరుపై జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

కాగా, జగ్గారెడ్డి చాలా సార్లు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పథకాలపై సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ అద్బుతమైన పథకాలు అందిస్తారని చెప్పుకొచ్చారు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడినని చెప్పుకునే జగ్గారెడ్డి.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పట్ల మాత్రం వ్యతిరేకత ప్రదర్శిస్తారు.

ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా.. మొదటి నుంచి రేవంత్ రెడ్డిని ఎందుకో విభేదిస్తుంటారు. తాజాగా రేపటి నుంచి (ఫిబ్రవరి 6) రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమవుతున్న సమయంలో అధికార బీఆర్ఎస్‌కి అనుకూలంగా.. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకొచ్చినా.. రేవంత్ పాదయాత్ర విషయాన్ని లైట్ తీసుకోవడం ఇప్పుడు పార్టీ శ్రేణులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Next Story