Telugu Global
Telangana

కాంగ్రెస్ డిపాజిట్లు ఎందుకు గల్లంతయ్యాయి..?

రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధిష్టానం తరపున ప్రచారానికి ఎవరూ రాలేకపోయారు. ఓవైపు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు, మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సీనియర్లంతా బిజీగా ఉండిపోయారు.

కాంగ్రెస్ డిపాజిట్లు ఎందుకు గల్లంతయ్యాయి..?
X


మునుగోడులో బీజేపీ ఓటమి ఊహించిందే. అయితే కాంగ్రెస్ ఘోర పరాభవం మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకి మునుగోడులో భారీ పరాజయం ఎదురైంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతోపాటు, డిపాజిట్లు గల్లంతు కావడంతో ఆ పార్టీ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఇంతకీ కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణం ఎవరు..?

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డికి 22వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లు కేవలం 23,601 మాత్రమే. అంటే అప్పటి మెజార్టీ ఓట్లు నిలబెట్టుకోడానికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాలు పడిందన్నమాట. 37,532 ఓట్లు వస్తే స్రవంతికి డిపాజిట్లన్నా దక్కేవి. వాటికి కూడా ఆమడ దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థి. అభ్యర్థిని ముందుగానే ప్రకటించి, అందరికంటే ముందు ప్రచారం మొదలు పెట్టినా మునుగోడులో కాంగ్రెస్ కి ఫలితం లేకుండా పోయింది.

ఎవరికి వారే యమునా తీరే..

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున ప్రచారం సరిగ్గా జరగలేదనేది వాస్తవం. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఓడిపోయే సీటు అంటూ ఆస్ట్రేలియాకి వెళ్లిపోయారు. సీనియర్లు చాలామంది ప్రచారానికి దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధిష్టానం తరపున ప్రచారానికి ఎవరూ రాలేకపోయారు. ఓవైపు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు, మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సీనియర్లంతా బిజీగా ఉండిపోయారు. దీంతో స్రవంతి ఒంటరి అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రయత్నం వృథా ప్రయాసగానే మిగిలింది.

కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఏమొస్తుంది..?

మునుగోడు ఓటర్లకి కూడా ఓ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నా ఉపయోగం లేదని వారికి అర్థమైంది. అందుకే ఎన్నికల ఏడాదిలో అధికార పార్టీ అభ్యర్థికే వారు మద్దతిచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ కి అసలు సిసలు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఓటమి మరింత నిరాశ మిగిల్చిందనే చెప్పాలి.

First Published:  6 Nov 2022 3:56 PM GMT
Next Story