Telugu Global
Telangana

కరెంట్ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి : మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటలకు ఒక సారి చొప్పున రెండు సార్లు కరెంటు ఇచ్చేది. దీని కోసం రైతన్నలు రాత్రంతా మేలుకొని ఉండాల్సి వచ్చేది.

కరెంట్ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి : మంత్రి కేటీఆర్
X

సీఎం కేసీఆర్ ఒక్కరే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. దేశంలో నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మాత్రం కరెంటు కనపడటం లేదు. రాష్ట్రంలోని ఏ ఊరికి పోతరో పొండి.. ఏ టైంకి పోతరో పొండి. వరుసగా నిలబడి కరెంట్ తీగలను పట్టుకుంటే కరెంట్ వస్తుందో రావడం లేదో అర్థం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేది. పంటలకు రోజుకు 6 గంటల కరెంట్ అని చెప్పి.. ఏనాడూ సక్రమంగా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు అసలు కరెంట్ గురించి మాట్లాడటానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. నిర్మల్ పట్టణంలో వివిధ రకాల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన కేటీఆర్.. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని, మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటలకు ఒక సారి చొప్పున రెండు సార్లు కరెంటు ఇచ్చేది. దీని కోసం రైతన్నలు రాత్రంతా మేలుకొని ఉండాల్సి వచ్చేది. ఇక ఎరువులు, విత్తనాల కోసం పోలీస్ స్టేషన్లు, దుకాణాల ముందు చెప్పుల లైన్లు దర్శనం ఇచ్చేవి. ఇలాంటి పరిస్థితులు అన్నీ మారిపోయాయని.. దీనికి సీఎం కేసీఆర్ రైతులకు ఇస్తున్న ప్రాధాన్యతే కారణమని కేటీఆర్ అన్నారు. అప్పట్లో తాగు నీటికి కూడా నిర్మల్ ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు శారు. ఎండాకాలం వచ్చిందంటే తెలంగాణలోని సర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలకు భయం పట్టుకునేది. ఎక్కడ ప్రజలు కుండలు, బిందెలు అడ్డం పెడతారో అని. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని కేటీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్‌ను రెండు సార్లు ఆశీర్వదించి రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో ఏం చేశామో మీ కళ్ల ముందే కనపడుతోంది. మాకే మళ్లీ ఎందుకు ఓటు వేయాలని కోరుతున్నామో చెప్పడానికే వచ్చాను. మేం చేసింది, చెప్పింది నిజమైతే మాకు కడుపు నిండా ఓట్లు వేయండి. ఒక వేళ మేం చెప్పింది తప్పైతే ఓట్లు వేయకండని కేటీఆర్ అన్నారు.

First Published:  4 Oct 2023 12:44 PM GMT
Next Story