Telugu Global
Telangana

గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్ నేతలు.. దేవుళ్ల ముందు ప్రమాణాలు

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు గ్యారెంటీ కార్డులను తీసుకెళ్లి బిర్లా టెంపుల్ లో పూజలు చేశారు. నాంపల్లి దర్గాలో ప్రార్థనలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్ నేతలు.. దేవుళ్ల ముందు ప్రమాణాలు
X

దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈసీకి కూడా హస్తం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. సీన్ కట్ చేస్తే.. కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు పరోక్ష ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సైలెంట్ పీరియడ్ ని కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటూ కాంగ్రెస్ నేతలే పూర్తిగా నిబంధనలకు నీళ్లొదిలారని విమర్శిస్తున్నారు.


అసలేం జరిగింది..?

ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలు గ్యారెంటీ కార్డులను తీసుకెళ్లి బిర్లా టెంపుల్ లో పూజలు చేశారు. నాంపల్లి దర్గాలో ప్రార్థనలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మల్లు రవి తదితరులు ఈ పూజలు, ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల కార్డు, మేనిఫెస్టో కార్డును బిర్లా టెంపుల్ లో వెంకటేశ్వర స్వామి ముందు ఉంచి పూజించారు. నాంపల్లి దర్గాలో కూడా మేనిఫెస్టో అమలు, ఆరు గ్యారెంటీలను చట్టం చేస్తామని ప్రమాణం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ ఫొటోలను ఉంచారు కాంగ్రెస్ నేతలు.

కాంగ్రెస్ ప్రచారం అంతా ఆరు గ్యారెంటీల చుట్టూనే తిరిగింది. ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఆరు గ్యారెంటీలను విశదీకరించి చెప్పేవారు. కర్నాటకలో గ్యారెంటీలను అమలు చేశామని, తెలంగాణలో కూడా నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ ఆరు గ్యారెంటీలు, మేనిఫెస్టోపై కాంగ్రెస్ నేతలు దేవుళ్ల సాక్షిగా ప్రమాణం చేయడం ఆసక్తిగా మారింది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ ప్రమాణాలను ఆక్షేపిస్తోంది. ఎన్నికల చిహ్నాలు, ఎన్నికల మెటీరియల్ ఎక్కడా కనపడకూడదు, ప్రచారం చేయకూడదు అని ఈసీ నిబంధనలు స్పష్టంగా ఉన్నా కూడా.. గ్యారెంటీ కార్డులు పట్టుకుని గుడులు, దర్గాల వెంట తిరుగుతున్న కాంగ్రెస్ నేతలు తాము చేసిన పనిని ఎలా సమర్థించుకుంటారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.


First Published:  29 Nov 2023 10:30 AM GMT
Next Story