Telugu Global
Telangana

పంతం నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలో మారిన రాహుల్ పాదయాత్ర రూట్

కీలకమైన నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటన ఉండాల్సిందేనని పట్టుబట్టారు. రేవంత్ సూచనలను అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకున్నది. దీంతో రూట్ మ్యాప్ మార్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పంతం నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలో మారిన రాహుల్ పాదయాత్ర రూట్
X

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎట్టకేలకు రాహుల్ గాంధీ పాదయాత్ర విషయంలో తన పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం తీసుకొని రావాలని, కేంద్రంలో పార్టీని అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేయనున్నారు. 'భారత్ జోడో యాత్ర' పేరుతో 150 రోజుల పాటు చేయనున్న ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభం కానున్న ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక మీదుగా తెలంగాణలోకి ప్రవేశించనున్నది. మక్తల్ సమీపంలో తెలంగాణలో ప్రవేశించే ఈ యాత్ర 13 రోజుల పాటు కొనసాగనున్నట్లు అధిష్టానం రూపొందించిన రూట్ మ్యాప్‌లో పేర్కొన్నారు.

కాగా, ఈ రూట్ మ్యాప్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని పార్టీ నాయకులు పోరాడుతున్న సమయంలో కేవలం సరిహద్దులోని కొన్ని నియోజకవర్గాలను టచ్ చేసి మహారాష్ట్రలోకి ప్రవేశించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఎలాగైనా హెచ్ఎండీఏ పరిధిలోని నియోజకవర్గాలతో పాటు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కూడా రాహుల్ పర్యటిస్తే పార్టీలో ఉత్సాహం వస్తుందని రేవంత్ చెప్పారు. దీంతో కొన్ని రోజుల నుంచి భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్‌ను మార్చడానికి అధిష్టానంతో చర్చలు జరిపారు. కీలకమైన నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటన ఉండాల్సిందేనని పట్టుబట్టారు. రేవంత్ సూచనలను అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకున్నది. దీంతో రూట్ మ్యాప్ మార్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణలో ప్రవేశించే రాహుల్ 'భారత్ జోడో యాత్ర'.. మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కడ్తాల్, షాద్‌నగర్ మీదుగా మహేశ్వరం చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, గజ్వేల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, భాన్సువాడ మీదుగా మహారాష్ట్రలో ప్రవేశిస్తుందని పార్టీ వర్గాలు చెప్పాయి. పాత రూట్ మ్యాప్ ప్రకారం రాహుల్ యాత్ర తెలంగాణలో 13 రోజుల పాటు కొనసాగాల్సి ఉన్నది. అయితే ఇప్పుడు రూట్ మ్యాప్‌లో మార్పులు జరగడంతో అదనంగా రెండు రోజులు తెలంగాణలో యాత్ర చేయబోతున్నారు. మొత్తం 15 రోజుల పాటు రాహుల్ యాత్ర తెలంగాణలో ఉండబోతున్నది. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, ఎంపీ, ఎమ్మెల్యేలు వెంట నడవనున్నారు.

అయితే, పాదయాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు తెలంగాణ-కర్నాటక సరిహద్దులో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కర్నాటక పీసీసీతో కలసి టీపీసీసీ ఈ సభకు ఏర్పాట్లు చేయనున్నది. నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా సభ కూడా ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

First Published:  1 Sep 2022 2:03 AM GMT
Next Story