Telugu Global
Telangana

రాష్ట్ర సంపదను పంచుకోవడమే వారి పని.. బీఆర్ఎస్‌పై ప్రియాంక గాంధీ విమర్శలు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాము ప్రకటించిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు.

రాష్ట్ర సంపదను పంచుకోవడమే వారి పని.. బీఆర్ఎస్‌పై ప్రియాంక గాంధీ విమర్శలు
X

తెలంగాణ ప్రజల స‌మ‌స్య‌ల‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, రాష్ట్ర సంపదను పంచుకోవడంలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా శనివారం మధిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. బీజేపీపైనా విమర్శలు చేశారు. తెలంగాణ సంపద ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారని, బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే వారి ఆకాంక్షలు నెరవేరేవని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాము ప్రకటించిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇస్తామన్న హామీని, రైతులకు రుణమాఫీ చేస్తామన్న హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదన్నారు.

ప్రజలు ఐక్యంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే.. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా మంత్రులు అయ్యారని చెప్పారు. ఆ పార్టీ నేతలందరికీ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్‌లు ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. దేశంలో ప్రజలే నాయకులని.. అయితే తాము ప్రజల కంటే అతీతులం అని నరేంద్ర మోడీ, కేసీఆర్ భావిస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు.

పోరాటాల గడ్డ మధిర.. : భట్టి

ప్ర‌చార సభలో కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మధిర పోరాటాల గడ్డ అని, కేసీఆర్ ఇటీవల ఇక్కడ సభ పెట్టి మధిరలో భట్టి విక్రమార్క గెలవలేడని అన్నారన్నారు. ఒక్క కేసీఆర్ కాదు.. వందమంది కేసీఆర్ లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ ఉడత ఊపులకు మధిర ప్రజలు భయపడరని ఆయన బదులిచ్చారు.

First Published:  25 Nov 2023 1:38 PM GMT
Next Story