Telugu Global
Telangana

కార్పొరేట‌ర్లు కారు దిగేస్తారా.. బ‌లం లేక‌పోయానా ఈ బ‌రితెగింపేంటి..?

బోర‌బండ కార్పొరేట‌ర్, మాజీ డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌తో ఆప‌రేష‌న్ జీహెచ్ఎంసీకి కాంగ్రెస్ శ్రీ‌కారం చుట్టింది. ఆయ‌న త‌న‌తోపాటు కొందరు కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

కార్పొరేట‌ర్లు కారు దిగేస్తారా.. బ‌లం లేక‌పోయానా ఈ బ‌రితెగింపేంటి..?
X

150 డివిజ‌న్లున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లో మొన్న‌టి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ద‌క్కిన‌వి కేవలం రెండంటే రెండే డివిజ‌న్లు. దానికి అన‌ధికారిక మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీకి వ‌చ్చింది ఒక్క‌టే డివిజ‌న్‌. కార్పొరేష‌న్లో జెండా ఎగ‌రేయాలంటే కావాల్సిన మ్యాజిక్ మార్క్ 76. దానికి కాంగ్రెస్‌కు కావాల్సింది మ‌రో 74 మంది కార్పొరేట‌ర్ల అండ‌. అంత‌మందిని ఇత‌ర పార్టీల నుంచి లాగాలంటే జ‌రిగే ప‌నేనా? కానీ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎందుకు?

గులాబీ పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డ‌మే ల‌క్ష్యం

మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ బలంగా నిల‌బ‌డింది. రాష్ట్రంలో అధికారం ద‌క్కినా కాంగ్రెస్‌కు న‌గ‌రంలో ప‌ట్టు చిక్క‌లేదు. ఈ నేప‌థ్యంలో రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నాటికి బీఆర్ఎస్‌ను హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ప‌రిధిలో బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌నే ల‌క్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ.. గులాబీ కార్పొరేట‌ర్ల‌పై దృష్టి పెట్టింది.

14 మందితో సంప్ర‌దింపులు

బోర‌బండ కార్పొరేట‌ర్, మాజీ డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌తో ఆప‌రేష‌న్ జీహెచ్ఎంసీకి కాంగ్రెస్ శ్రీ‌కారం చుట్టింది. ఆయ‌న త‌న‌తోపాటు కొందరు కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్ప‌టికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో అంత‌గా పొసగని కార్పొరేటర్లు పార్టీ వీడాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపుర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల్లోని 14 మంది కార్పొరేటర్లతో కాంగ్రెస్‌ నేతలు సంప్రదింపులు జరిపార‌ని విశ్వసనీయ సమాచారం.

డుమ్మా కొట్టిన డిప్యూటీ మేయర్‌

ఈ నేప‌థ్యంలో తెలంగాణభవన్‌లో కార్పొరేటర్లతో కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. దీనికి డిప్యూటీ మేయర్‌ శ్రీలతాశోభన్‌రెడ్డి డుమ్మా కొట్టారు. ఇలాంటి వారు ఇంకెంద‌రున్నార‌నేది బీఆర్ఎస్‌కు అంతుప‌ట్ట‌డం లేదు. అయితే జీహెచ్ఎంసీ విష‌యంలో కాంగ్రెస్ త‌న‌కు లేని బ‌లాన్ని కొనితెచ్చుకునే ప‌నిలో ప‌డిన‌ట్టుగా ప‌లువురు ఆరోపిస్తున్నారు.

First Published:  11 Feb 2024 12:19 PM GMT
Next Story