Telugu Global
Telangana

చెప్పులతో కొట్టుకున్నకాంగ్రెస్ నేతలు.. వరంగల్ లో గ్రూప్ రాజకీయాలు

వరంగల్‌ కాంగ్రెస్‌ లో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. కొండా దంపతుల అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు ఈరోజు బాహాబాహీకి దిగారు. చెప్పులతో దాడి చేసుకోవడంతో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.

చెప్పులతో కొట్టుకున్నకాంగ్రెస్ నేతలు.. వరంగల్ లో గ్రూప్ రాజకీయాలు
X

కర్నాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలో కూడా సత్తా చూపిస్తామంటోంది. అధిష్టానం చాలా ఆశలు పెట్టుకుంది కానీ తెలంగాణలో గ్రూపు రాజకీయాలు మాత్రం పార్టీ అవస్థను చెప్పకనే చెబుతున్నాయి. పోనీ పెద్ద తలకాయలే కుస్తీ పడుతున్నాయా అంటే జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉందని అర్థమవుతోంది. తాజాగా వరంగల్ లో డీసీసీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం సమయంలోనే కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. చేతి దెబ్బలు, చెంప దెబ్బలు, తిట్లదండకంతో సరిపెట్టుకోలేదు.. ఏకంగా చెప్పులతో కొట్టుకోవడం ఇక్కడ విశేషం.

వరంగల్‌ కాంగ్రెస్‌ లో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. కొండా దంపతుల అనుచరులు, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు ఈరోజు బాహాబాహీకి దిగారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం స్వీకారోత్సవంలో ఈ రసాభాసా జరిగింది. చెప్పులతో దాడి చేసుకోవడంతో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. కాంగ్రెస్ లో కుమ్ములాటలు మామూలే అయినా, ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న ఈ సందర్భంలో ఇలా నేతలు కొట్టుకుంటూ రోడ్డునపడటం మాత్రం ఆశ్చర్యంగా ఉంది.

సురేఖ వర్సెస్ స్వర్ణ..

వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, రాజేశ్వరరావు దంపతులు జిల్లాపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఆమధ్య వారిద్దరూ పార్టీకి దూరం జరగాలనుకున్నా.. రేవంత్ రెడ్డి బుజ్జగించి సర్దుబాటు చేశారు. ఆ తర్వాత స్వర్ణకు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. వీరి పెత్తనం కొండా సురేఖ, మురళికి ఇష్టం లేదు. ఈ దశలో డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ కార్యకర్తల సమావేశం నిర్వహించగా కొండా దంపతులు దూరంగా ఉన్నారు. అయితే వారి అనుచరులు మాత్రం ఈ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులతో కొండా వర్గం వాగ్వాదానికి దిగింది. చొక్కాలు చించుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. అయితే ఇది గ్రూప్‌ వార్‌ కాదని, కులం పేరుతో ఓ వ్యక్తి దూషించినందుకు నెలకొన్న వివాదం మాత్రమేనని కాంగ్రెస్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

First Published:  31 May 2023 10:41 AM GMT
Next Story