Telugu Global
Telangana

హోంమంత్రిగా షబ్బీర్‌ అలీ..!

మంత్రిత్వ శాఖలన్నింటిలోకెల్లా హోంశాఖ అత్యంత కీలకం. ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతల పర్యవేక్షణ పూర్తి బాధ్యత హోంశాఖదే.

హోంమంత్రిగా షబ్బీర్‌ అలీ..!
X

తెలంగాణ హోంమంత్రిగా షబ్బీర్ అలీకి అవకాశం ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈమేరకు కాంగ్రెస్ వర్గాల్లో ఊహగానాలు జోరందుకున్నాయి. ఇక రేవంత్ రెడ్డి సైతం షబ్బీర్‌ అలీకి హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా షబ్బీర్‌ అలీకి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారని సమాచారం. ఓడిపోయిన అభ్యర్థులకు ఇవ్వొద్దని నియమం పెట్టుకున్నప్పటికీ.. షబ్బీర్ అలీ విషయంలో మినహాయింపు ఇస్తారని తెలుస్తోంది. మైనార్టీ కోటాలో షబ్బీర్‌కే అవకాశం ఇస్తారని సమాచారం.

మంత్రిత్వ శాఖలన్నింటిలోకెల్లా హోంశాఖ అత్యంత కీలకం. ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతల పర్యవేక్షణ పూర్తి బాధ్యత హోంశాఖదే. సహజంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట తమకు అత్యంత నమ్మకస్తులైన వారిని హోంశాఖ మంత్రిగా నియమిస్తారు. బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ తొలి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. రెండో సారి మహమూద్ అలీకి అవ‌కాశం ద‌క్కింది.

ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి హోంమంత్రి బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వచ్చిన‌ప్ప‌టికీ అవి అవాస్త‌వ‌మ‌ని తేలిపోయింది. ప్రస్తుతం సీఎం దగ్గరే హోం శాఖ ఉంది. పార్టీలో గ్రూపుల నేపథ్యంలో రేవంత్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తికే హోంశాఖ ఇస్తారని సమాచారం.

ఇక కాంగ్రెస్ అధిష్టానం సైతం హోంశాఖ మైనార్టీలకు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో మైనార్టీలు కొంతమేర కాంగ్రెస్‌కు మొగ్గుచూపారు. రేవంత్ రెడ్డి కోసం కామారెడ్డి సీటు త్యాగం చేశారు షబ్బీర్అలీ. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ కోటా నుంచి సీనియర్ లీడర్‌గా ఉన్నారు. ఫిరోజ్‌ఖాన్ సైతం నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో సీనియర్ నేత షబ్బీర్‌ అలీకే కేబినెట్‌లో అవకాశం దక్కనుంది.

First Published:  19 Dec 2023 7:43 AM GMT
Next Story