Telugu Global
Telangana

ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా తెరపైకి కొత్తపేరు

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ముగ్గురు మంత్రులు ఉండగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాదరెడ్డికి, తుమ్మల తన కుమారుడు యుగంధర్‌ కోసం ప్రయత్నాలు చేశారు.

ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా తెరపైకి కొత్తపేరు
X

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. మొదటి నుంచి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని కోరగా పార్టీ హైకమాండ్ తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పుడు రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. నిన్నా,మొన్నటివరకు పొంగులేటి వియ్యంకుడు, మాజీ ఎంపీ ఆర్.సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి పేరు వినిపించగా.. తాజాగా మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ముగ్గురు మంత్రులు ఉండగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాదరెడ్డికి, తుమ్మల తన కుమారుడు యుగంధర్‌ కోసం ప్రయత్నాలు చేశారు. చివరకు నందిని, ప్రసాదరెడ్డి పోటీలో నిలిచినా హైకమాండ్ వీరిద్దరి పేర్లు పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఖమ్మం లోక్‌సభ స్థానానికి తాను సూచించిన అభ్యర్థికి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని.. దాన్ని అమలు చేయాలని పొంగులేటి కోరినట్లు సమాచారం.

అయితే తాజాగా నిజామాబాద్‌కు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు పేరు తెరపైకి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండవ పేరును కొందరు ముఖ్యనాయకులు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఇక ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి తేలిన తర్వాతే కరీంనగర్ అభ్యర్థిపై పార్టీ నిర్ణయం తీసుకోనుంది. కరీంనగర్ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఖమ్మం అభ్యర్థిని బట్టి వీరిలో ఒకరికి అవకాశం లభించవచ్చని సమాచారం.

First Published:  9 April 2024 3:26 AM GMT
Next Story