Telugu Global
Telangana

హామీ ఇచ్చి హ్యాండిచ్చారు.. పటేల్ నిర్ణయంపై ఆసక్తి

తాజాగా నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో నల్గొండ స్థానం కూడా ఉంది. నల్గొండ టికెట్ పటేల్‌కు కాకుండా జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డికి కేటాయించింది.

హామీ ఇచ్చి హ్యాండిచ్చారు.. పటేల్ నిర్ణయంపై ఆసక్తి
X

నల్గొండ జిల్లాకు చెందిన పటేల్ రమేష్‌ రెడ్డికి మరోసారి మొండిచేయిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో సూర్యాపేట టికెట్‌ను ఆశించి భంగపడిన రమేష్‌ రెడ్డికి.. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది హస్తం పార్టీ. కానీ, ఈ సారి కూడా హ్యాండిచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డారు.

ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో సూర్యాపేట టికెట్ ఆశించారు పటేల్ రమేష్‌ రెడ్డి. కానీ సీనియర్ నేత, మాజీమంత్రి దామోదర్ రెడ్డి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడంతో ఆయనకు కేటాయించింది. దీంతో రమేష్‌ రెడ్డి ఓ దశలో పార్టీని వీడి స్వతంత్రగా బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేశారు. వెంటనే అధిష్టానం దూతలను పంపి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ టికెట్ పటేల్ రమేష్‌ రెడ్డికే ఇస్తామని.. అందుకు తమకు ఏ అభ్యంతరం లేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్లు ఆయనకు పేపరుపై సంతకాలు పెట్టి మరీ లిఖితపూర్వక హామీ ఇచ్చారు.

కానీ, తాజాగా నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో నల్గొండ స్థానం కూడా ఉంది. నల్గొండ టికెట్ పటేల్‌కు కాకుండా జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డికి కేటాయించింది. జానారెడ్డి మరో కుమారుడు జయవీర్ రెడ్డి ఇప్పటికే నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక భువనగిరి టికెట్ పటేల్ రమేష్‌ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతున్నా.. అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి, ఆయన అన్న కుమారుడు కోమటిరెడ్డి పవన్‌కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో పటేల్ రమేష్‌ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన పార్టీ మారతారా.. లేదా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

First Published:  9 March 2024 5:00 AM GMT
Next Story