Telugu Global
Telangana

రేవంత్‌కు మరో టాస్క్.. అధిష్టానం టార్గెట్‌ ఇదే..!

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 12 స్థానాలు చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్‌ రెడ్డికి ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది.

రేవంత్‌కు మరో టాస్క్.. అధిష్టానం టార్గెట్‌ ఇదే..!
X

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందన్న నేపథ్యంలో ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది హస్తం పార్టీ. లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మిత్రపక్షాలతో సీట్ల పంపకం కూడా తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రాల వారీగా ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పజెప్పింది. ఆయనను ప్రదేశ్ ఎలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం సహా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు చోటు కల్పించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ రేవంత్‌పై పూర్తి నమ్మకం ఉంచిన కాంగ్రెస్‌ పార్టీ.. మరోసారి ఆయనపైనే భారం వేసింది. ప్రస్తుతం దక్షిణాదిన కాంగ్రెస్ పూర్తిగా పట్టు సాధించింది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగా.. తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే అధికారంలో ఉంది. ఇక కేరళలోనూ కాంగ్రెస్‌కు మంచి ఫలితాలే వస్తాయని భావిస్తున్నారు.

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 12 స్థానాలు చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్‌ రెడ్డికి ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది. లోక్‌సభ సభ్యుల ఎంపిక, వారి బలాబలాలు, సామాజిక సమీకరణాలు విశ్లేషించి ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయనుంది. కమిటీలో ఉన్న పలువురు సభ్యులు సైతం లోక్‌సభ టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో జానారెడ్డి, బలరాం నాయక్‌, వంశీచంద్ రెడ్డి. అంజన్‌ కుమార్ యాదవ్ లాంటి నేతలు లోక్‌సభ టికెట్ రేసులో ఉన్నారు.

రేవంత్ నేతృత్వంలోని కమిటీలో సభ్యులుగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు సీనియర్లు జానారెడ్డి, వీహెచ్‌, మధుయాష్కి, గీతారెడ్డి, జగ్గారెడ్డి, అజహారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, సంపత్‌కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్‌, మహేష్ కుమార్ గౌడ్, పొదెం వీరయ్య, సునీతా రావు, షబ్బీర్ అలీ, ప్రేమ్‌సాగర్‌ రావు ఉన్నారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్‌, NSUI, సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షులకు కమిటీలో చోటు కల్పించారు.

First Published:  7 Jan 2024 6:17 AM GMT
Next Story