Telugu Global
Telangana

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి

ఇస్తే సీఎం పదవి ఇవ్వండి లేదంటే మంత్రి పదవి కూడా వద్దు అని.. ఉత్తమ్ అన్నట్లు ప్రచారం జరగడంతో సీఎం ఎంపిక మరింత క్లిష్టంగా మారింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి
X

రెండు రోజుల ఉత్కంఠకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తెరదించింది. తెలంగాణ కొత్త సీఎంగా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేసులో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క కూడా నిలవడంతో వీరిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

నిన్న ఉదయం హైదరాబాద్‌లో సీఎల్పీ మీటింగ్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ ఎదురు చూసినప్పటికీ, ప్రకటన మాత్రం రాలేదు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు మాత్రమే సేకరించారు. అయితే నిన్నటి వరకు ముఖ్యమంత్రి రేసులో రేవంత్, భట్టి మాత్రమే ఉండగా.. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేసులోకి వచ్చారు. దీంతో ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ అగ్ర నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై తీవ్ర చర్చలు జరిపారు.

ఇస్తే సీఎం పదవి ఇవ్వండి లేదంటే మంత్రి పదవి కూడా వద్దు అని.. ఉత్తమ్ అన్నట్లు ప్రచారం జరగడంతో సీఎం ఎంపిక మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో భట్టి, ఉత్తమ్‌లను ఇవాళ ఢిల్లీకి పిలిపించిన కాంగ్రెస్ అధిష్టానం వారికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ప్రాధాన్యం ఉన్న మంత్రిత్వ శాఖలు అప్పగిస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం.

మెజారిటీ ఎమ్మెల్యేలతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపడంతో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

First Published:  5 Dec 2023 1:48 PM GMT
Next Story