Telugu Global
Telangana

కాళేశ్వరంపై కాంగ్రెస్‌ వెనుకడుగు.. రిపేర్లకు ఆదేశం..!

బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం నీరు రావడంతోనే కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలు పండించారు రైతులు.

కాళేశ్వరంపై కాంగ్రెస్‌ వెనుకడుగు.. రిపేర్లకు ఆదేశం..!
X

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఓ అడుగు వెనక్కి వేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొనడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాన్ని గుర్తించినట్లు సమాచారం. మొన్నటివరకు నిపుణుల నుంచి నివేదిక వచ్చే వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి రిపేర్లు చేయబోమని ఖరాకండిగా చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు మరమ్మతులకు ఆదేశించారు.

వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని కాంట్రాక్టు సంస్థలకు సూచించారు ENC. డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చిన తర్వాత శాశ్వత మరమ్మతులు చేయనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రస్తుతం తాత్కాలిక రిపేర్లు చేసి.. వర్షాకాలంలో నీటిని నిల్వ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎల్‌ అండ్ టీ, నవయుగ, మేఘా, అఫ్కాన్స్‌ కాంట్రాక్టు సంస్థలతో ENC సమావేశమయ్యారు.

బ్యారేజీలను కట్టి రిజర్వాయర్ల లాగా ఉపయోగించడం వల్లే సమస్యలు వచ్చాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేసినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్‌కు షీట్ ఫైల్స్ వేసి గ్రౌటింగ్ చేయాలని.. రాఫ్ట్ కింద గుంతలు ఏ మేర ఉన్నాయో గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు సంస్థలను ఇంజినీర్లు కోరినట్లు సమాచారం.

అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని.. ఆ ప్రాజెక్టు ద్వారా ఎకరాకు కూడా నీరందలేదని సీఎం రేవంత్‌తో సహా మంత్రులు చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది రూ.80 వేల కోట్లే ఐనప్పటికీ..లక్ష కోట్లు వృథా అయ్యాయంటూ బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం నీరు రావడంతోనే కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలు పండించారు రైతులు. కాగా, ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు కుంగడంతో మూడు బ్యారేజీల్లోని నీటిని పూర్తిగా ఖాళీ చేశారు. దీంతో చాలా చోట్ల పంటలకు నీరందక ఎండిపోయాయి. కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయకపోవడంతో ప్రధాన జలాశయాలైన ఎల్లంపల్లి, మిడ్‌మానేర్‌, లోయర్‌ మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్లలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటి నిల్వలు పడిపోయాయి.

First Published:  11 April 2024 8:49 AM GMT
Next Story