Telugu Global
Telangana

కాంగ్రెస్ లో తొలి జాబితా మంటలు.. గాంధీ భవన్ లో గలాటా

టికెట్ల ప్రకటన తర్వాత గాంధీ భవన్ ను మైనార్టీ నేతలు ముట్టడించారు. మల్లు రవి ప్రెస్ మీట్ ని అడ్డుకున్నారు.

కాంగ్రెస్ లో తొలి జాబితా మంటలు.. గాంధీ భవన్ లో గలాటా
X

కాంగ్రెస్ తొలిజాబితా ప్రకటన తర్వాత గాంధీ భవన్ లో రచ్చ రచ్చ జరగడం ఖాయమంటూ బీఆర్ఎస్ విసిరిన వ్యంగ్యాస్త్రాలను అక్షరాలా నిజం చేశారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. గాంధీ భవన్ లో గొడవ జరగడం అటుంచి.. అసంతృప్తులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. నోటుకు సీటు అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టికెట్ల ప్రకటన తర్వాత గాంధీ భవన్ ను మైనార్టీ నేతలు ముట్టడించారు. మల్లు రవి ప్రెస్ మీట్ ని అడ్డుకున్నారు. బహదూర్‌ పుర టికెట్‌ విషయంలో యూసఫ్ దానిష్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఆ టికెట్ రాజేష్ కు కేటాయించడాన్ని వారు తప్పుబట్టారు. చాంద్రాయణగుట్ట, యూకత్ పుర, మలక్ పేట నియోజకవర్గాల విషయంలో కూడా టికెట్ల కేటాయింపు అగ్గిరాజేసింది. అసంతృప్తులు గాంధీభవన్ ముందే ఆందోళన చేపట్టారు. గద్వాల నేతలు కూడా గాంధీ భవన్ వద్ద రచ్చ చేశారు.

ప్యారాచూట్ నేతలకే కేటాయింపులు..

నెలరోజుల క్రితం పార్టీలో చేరినవారికి అప్పుడే టికెట్లు ఎలా ఖరారు చేస్తారని నిలదీస్తున్నారు అసంతృప్త నేతలు. జూపల్లి, మైనంపల్లికి టికెట్లు ఖరారు చేసి, మిగతా సీనియర్లను పక్కనపెట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు.

కన్నీరు పెట్టుకున్న లక్ష్మారెడ్డి..

ఉప్పల్ టికెట్ విషయంలో తనను రేవంత్ రెడ్డి మోసం చేశారంటూ ప్రెస్ మీట్ లో రాగిడి లక్ష్మారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు ఎంతో కష్టపడ్డానని, పార్టీ బలోపేతానికి కృషి చేశానని, అయినా తనను పట్టించుకోలేదని వాపోయారు. టికెట్ కోసం తనను కూడా డబ్బులు కావాలని అడిగారని, సర్వే చేయకుండానే ఇతరులకు టికెట్ కేటాయించారని ఆరోపించారు. చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ని సర్వనాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు లక్ష్మారెడ్డి. మేడ్చల్‌ లో కూడా అదే గొడవ. మేడ్చల్‌ టికెట్‌ ను బోడుప్పల్‌ నివాసి తోటకూర వజ్రేష్ యాదవ్‌ కు కేటాయించడంతో, హరివర్ధన్‌రెడ్డి అలకబూనారు. 55 సీట్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. కాంగ్రెస్ మొత్తం లిస్ట్ బయటకొస్తే ఇంకెలా ఉంటుందో అంచనా వేయలేమంటున్నారు నేతలు.

First Published:  16 Oct 2023 4:10 AM GMT
Next Story