Telugu Global
Telangana

అమ్ముడుపోయినవారిదే తప్పుడు ప్రచారం.. స్రవంతి ఆగ్రహం

రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని, ఆయనలాగా అందరూ కాంట్రాక్ట్ పనులకు అమ్ముడుపోతారనుకోవడం ఆయన భ్రమ అని అన్నారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనే దమ్ములేక తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు స్రవంతి.

అమ్ముడుపోయినవారిదే తప్పుడు ప్రచారం.. స్రవంతి ఆగ్రహం
X

ఒక ఆడపిల్లను ఎదుర్కొనే సత్తా లేక బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను పార్టీ మారానని ప్రచారం చేస్తున్న వారిపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇదంతా బీజేపీ నేతల కుట్రేనని అన్నారామె.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కేసీఆర్ ని కలిశారని, ఆమె టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారంటూ ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఓ ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. సరిగ్గా పోలింగ్ వేళ ఇలాంటి ఫేక్ న్యూస్ బయటకు రావడంపై పాల్వాయి స్రవంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారాన్ని, కాంగ్రెస్ శ్రేణులు, మునుగోడు ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు స్రవంతి.

నేను ఎవరికీ అమ్ముడుపోలేదు..

తానెవరికీ అమ్ముడుపోలేదని, అలాంటి వ్యక్తిని తాను కానని చెప్పారు స్రవంతి. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ తోటే ఉంటానని అన్నారు. అమ్ముడుపోయినవారే ఇలా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని, ఆయనలాగా అందరూ కాంట్రాక్ట్ పనులకు అమ్ముడుపోతారనుకోవడం ఆయన భ్రమ అని అన్నారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనే దమ్ములేక తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు స్రవంతి. తప్పుడు వార్తలపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని, ఆ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిందెవరో తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు స్రవంతి.

First Published:  3 Nov 2022 4:33 AM GMT
Next Story