Telugu Global
Telangana

కేటీఆర్‌ను బద్నాం చేయడానికే కాంగ్రెస్, బీజేపీ హై డ్రామా.. ఆ యువకుడు అసలు గ్రూప్స్‌ పరీక్షలే రాయలేదు!

ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుమార్ కుటుంబ సభ్యులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అధైర్య పడవద్దని, మీ కుటుంబానికి అండగా ఉంటామంటూ తండ్రి నాగభూషణంకు ఫోన్‌ చేసి భరోసా ఇచ్చారు.

కేటీఆర్‌ను బద్నాం చేయడానికే కాంగ్రెస్, బీజేపీ హై డ్రామా.. ఆ యువకుడు అసలు గ్రూప్స్‌ పరీక్షలే రాయలేదు!
X

సిరిసిల్లలో ఓ యువకుడు బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేయగా.. అతడి విద్యార్హత సదరు ఉద్యోగానికి సరిపోదని అధికారులు తిరస్కరించారు. ఇదే విషయం తండ్రికి చెప్పి బాధపడ్డాడు. ఏం పర్వాలేదు బిడ్డా.. ఇంకో ఉద్యోగం వస్తుందిలే అని తండ్రి ఓదార్చాడు. అయినా సరే బాధలో మునిగిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదీ ఆ తండ్రి స్వయంగా చెప్పిన విషయం. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం సదరు యువకుడు గ్రూప్-1 పరీక్ష రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం మొదలు పెట్టారు. సిరిసిల్లకు చెందిన యువకుడు కావడంతో మంత్రి కేటీఆర్‌పై ఆ ఆత్మహత్యను నెట్టేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ.. మంత్రి కేటీఆర్‌ను దీనిలోకి లాగడానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల్లోకి వెళితే..

సిరిసిల్ల పట్టణానికి చెందిన నవీన్ కుమార్ (30) హెటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ పూర్తి చేసి పలు ప్రైవేటు సంస్థల్లో పని చేశాడు. ఇంటర్ తర్వాత మూడేళ్లు హైదరాబాద్‌లోనే ఈ కోర్సు చదివాడు. ఆ తర్వాత నగరంలోనే ఒక హోటల్‌లో కొన్నాళ్లు పని చేశాడు. ఆ తర్వాత సిరిసిల్లలోని రిలయన్స్ ట్రెండ్స్‌లో పని చేశాడు. ఇటీవల ఒక ప్రైవేట్ బ్యాంకులో క్లర్క్ పోస్టు కోసం దరఖాస్తు చేశాడు. ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత.. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం వెళ్లగా.. ఈ పోస్టుకు హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తే సరిపోదని.. బ్యాంకు నిబంధనలు ఒప్పుకోవంటూ అధికారులు చెప్పారు. దీంతో మానసికంగా కృంగి పోయాడు. ఇది కాకపోతే మరో జాబ్ చూసుకోమని చెప్పానని తండ్రి కూడా చెప్పాడు. కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

తన కొడుకు ఎలాంటి గ్రూప్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కాలేదని, అసలు అప్లయ్ చేయలేదని తండ్రి స్పష్టం చేశాడు. ఈ ఆత్మహత్యతో ప్రభుత్వానికి కానీ, గ్రూప్-1 లీకేజీకి కానీ సంబంధం లేదని నవీన్ తండ్రి నాగభూషణం తెలిపారు. అయినా సరే.. కొంత మంది రాజకీయ నాయకులు తమను ఇందులోకి లాగుతున్నారని చెప్పుకొచ్చాడు. కొంత మంది వచ్చి మాతో మాట్లాడినా.. మీకేం సంబంధం అని చెప్పామని అన్నాడు.

తండ్రి, కుటుంబ సభ్యులు ఇలా చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తి అవాస్తవాలు ప్రచారానికి పెట్టారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్-1 కోసం ప్రిపేర్ అయిన నవీన్.. లీకేజీ పరిణామాలతో మనస్తాపానికి గురై చనిపోయాడంటూ రేవంత్ రెడ్డి పోస్టు పెట్టారు. ప్రభుత్వం రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని కూడా చెప్పారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మంత్రి కేటీఆర్ ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నాయకులు జి. వివేక్ కూడా సోషల్ మీడియాలో ఇదే రీతిలో పోస్టు పెట్టారు. గ్రూప్ పరీక్ష పత్రం లీక్ అవడంతోనే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రచారం చేశారు. అసలు విషయం తెలసుకోకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇలా మంత్రి కేటీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేశాయి.

కాగా, ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుమార్ కుటుంబ సభ్యులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అధైర్య పడవద్దని, మీ కుటుంబానికి అండగా ఉంటామంటూ తండ్రి నాగభూషణంకు ఫోన్‌ చేసి ఓదార్చారు. నవీన్ అర్ధాంతరంగా తనువు చాలించడం బాధకరమని మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

First Published:  19 March 2023 3:07 AM GMT
Next Story