Telugu Global
Telangana

పాలమూరు అభ్యర్థులపై గందరగోళం.. రీ సర్వే చేయిస్తున్న కాంగ్రెస్?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తే. అయితే ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

పాలమూరు అభ్యర్థులపై గందరగోళం.. రీ సర్వే చేయిస్తున్న కాంగ్రెస్?
X

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేసింది. పార్టీలోకి చేరికలు కూడా పెరుగుతుండటంతో చాలా చోట్ల మరో సారి సర్వేలు చేయిస్తోంది. బీఆర్ఎస్‌లో టికెట్లు ఆశించి భంగపడిన వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అయితే చాలా మంది టికెట్లు కన్ఫార్మ్ అయితేనే పార్టీలో చేరతామని చెబుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు చోట్ల కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు వారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తే. అయితే ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విషయంలో రేవంత్ రెడ్డి కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీంతో మరోసారి గ్రౌండ్ లెవెల్‌లో రీసర్వే చేయిస్తున్నట్లు తెలుస్తున్నది. నియోజకవర్గాల వారిగా సునిల్ కనుగోలు టీమ్‌తో పాటు కొన్ని థర్డ్ పార్టీ పార్టీలు కూడా చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్నవారు భారీగానే ఉన్నారు. ఇక ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు వర్గం కూడా పలు చోట్ల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు.

పాత కాంగ్రెస్ నాయకులు, కొత్తగా చేరిన వారి మధ్య టికెట్ల కోసం ఆధిపత్య పోరు నడుస్తున్నది. కొంత మంది పాత పరిచయాలతో ఏఐసీసీ వద్ద టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇతర నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని? గెలిచే వాళ్లు ఎవరో గుర్తించి టికెట్లు ఇవ్వాలని గట్టిగానే కోరారు. దీంతో రీసర్వేకు టీపీసీసీ పాలమూరు జిల్లాలో ప్రత్యేక బృందాలను దింపింది.

నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, మక్తల్ నియోజకవర్గాల్లో ఇప్పటికే రీసర్వే స్టార్ట్ అయ్యింది. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా రీసర్వే చేయాలని స్థానిక నాయకులు పట్టుబడుతున్నారు. సర్వే తర్వాత గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, గద్వాల నుంచి సరిత, ఆలంపూర్ నుంచి సంపత్ కుమార్, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట నుంచి వంశీకృష్ణ, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఇక మిగిలిన నియోజకవర్గాల టికెట్ల విషయంలోనే ఏఐసీసీ మల్లగుల్లాలు పడుతున్నది. రీసర్వే రిజల్ట్ వచ్చిన తర్వాతే వారికి టికెట్లు కన్ఫార్మ్ అయ్యే అవకాశఆలు ఉన్నట్లు తెలుస్తున్నది. కాస్త ఆలస్యం అయినా.. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్నది.

First Published:  3 Oct 2023 4:31 AM GMT
Next Story