Telugu Global
Telangana

రైతుభరోసాపై కాంగ్రెస్‌ గందరగోళం..!

యూఎస్‌ఏ వారధి కార్యక్రమంలో ఓ NRI.. రైతుభరోసా కింద కౌలు రైతుతో పాటు ఆ భూ యజమానికి కూడా ఆర్థికసాయం అందిస్తారా..? అని ప్రశ్నించారు.

రైతుభరోసాపై కాంగ్రెస్‌ గందరగోళం..!
X

తెలంగాణలో రైతుభరోసా అమలుపై ఓ కాంగ్రెస్ నేత ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు గందరగోళానికి దారి తీసింది. రైతులకు, కౌలు రైతులకు ఏటా రైతుభరోసా కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. కౌలు రైతులకు ఆర్థికసాయం అందిస్తే సదరు భూయజమానికి రైతుభరోసా కింద ఎలాంటి ఆర్థికసాయం ఇచ్చేది లేదని స్పష్టంచేసింది.

టీవీ-9 నిర్వహించిన యూఎస్‌ఏ వారధి కార్యక్రమంలో ఓ NRI.. రైతుభరోసా కింద కౌలు రైతుతో పాటు ఆ భూ యజమానికి కూడా ఆర్థికసాయం అందిస్తారా..? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో కౌలు రైతులు 20లక్షల మంది ఉన్నారని, వారికి రూ.15వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టామన్నారు కాంగ్రెస్ నేత. కౌలు రైతుకు ఆర్థికసాయం ఇస్తే.. ఆ భూయజమానికి ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు.


కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించింది. కాంగ్రెస్‌ అంటేనే మోసం అని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ అసలు స్వరూపం బయటపడిందని.. కౌలు రైతులకు రైతుభ‌రోసా ఇచ్చినప్పుడు అసలు రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండదని కాంగ్రెస్‌ చెప్తోందని ట్వీట్ చేసింది. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని రైతన్నలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్‌. రైతు ప్రయోజనాలను కాపాడుకుందామని తన ట్వీట్‌లో స్పష్టం చేసింది.

కాంగ్రెస్ ప్రకటించిన రైతుభరోసా హామీపై మేనిఫెస్టోలో క్లారిటీ ఇవ్వలేదు. రైతుకు ఏటా మొత్తం రూ.15వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తారా లేదా మొత్తం ఆర్థిక సాయం కింద రూ.15 వేలు మాత్రమే ఇస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇదే అంశాన్ని మంత్రి హరీష్ రావు సైతం తన ప్రచార సభల్లో ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌ వస్తే ఏటా రూ.15 వేలు మాత్రమే రైతుబంధు ఇస్తారని.. బీఆర్ఎస్‌ వస్తే ఎకరాకు రూ.16 వేల సాయం అందిస్తామని చెప్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ నుంచి కచ్చితమైన స్పష్టత రావాల్సి ఉంది.

First Published:  25 Nov 2023 5:07 AM GMT
Next Story