Telugu Global
Telangana

రాయితీలు రద్దు.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్

ఎండలు మండిపోతుండటంతో హైదరాబాద్ సిటీలో బస్సు, ఆటో ప్రయాణాలు తగ్గాయి. మెట్రోవైపు ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏసీ ప్రయాణం హాయిగా ఉండటంతో చాలామంది మెట్రోని ఆశ్రయిస్తున్నారు.

రాయితీలు రద్దు.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్
X

హైదరాబాద్ మెట్రో యాజమాన్యం మరోసారి ప్రయాణికులకు షాకిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు టికెట్ పై ఇచ్చే 10 శాతం రాయితీని తొలగించారు. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా వేసవి సందర్భంగా ఏప్రిల్ లో రద్దీ పెరగడంతో ఇలాగే రాయితీలు రద్దు చేశారు. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయింది.

ఎండలు మండిపోతుండటంతో హైదరాబాద్ సిటీలో బస్సు, ఆటో ప్రయాణాలు తగ్గాయి. మెట్రోవైపు ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏసీ ప్రయాణం హాయిగా ఉండటంతో చాలామంది మెట్రోని ఆశ్రయిస్తున్నారు. వేసవి సెలవలతో ప్రయాణాల సంఖ్య మరింత పెరిగింది. రద్దీ పెరగడంతో మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీలను రద్దు చేసింది, హాలిడే కార్డుని రద్దు చేసింది. అంటే ఇప్పుడు ఎవరైనా పూర్తి చార్జి చెల్లించి మెట్రోలో ప్రయాణించాల్సిందే. సడన్ గా రాయితీ ఎత్తివేయడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు.

మెట్రో కోచ్ ల సంఖ్య పెరగకపోవడంతో రద్దీ సమయంలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గతంలో కోచ్ ల పెంపు ప్రతిపాదనలు తుది దశకు చేరుకున్నా.. ఫలితం మాత్రం కనపడలేదు. కోచ్ ల సంఖ్య పెంచాలని, రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు నగరవాసులు.

First Published:  7 April 2024 5:54 AM GMT
Next Story