Telugu Global
Telangana

బీజేపీలో మొదలైన టికెట్ల గోల.. ఐదు వేర్వేరు జాబితాలు పంపనున్న ముఖ్య నేతలు!

తెలంగాణ బీజేపీలో ఉన్న సీనియర్, ముఖ్య నాయకులతో కూడిన ఈ జాబితాను ఐదుగురు నేతలు వేర్వేరుగా తయారు చేసినట్లు తెలుస్తున్నది.

బీజేపీలో మొదలైన టికెట్ల గోల.. ఐదు వేర్వేరు జాబితాలు పంపనున్న ముఖ్య నేతలు!
X

తెలంగాణలో ఎన్నికల సమరం షురూ అయ్యింది. ఇప్పటికే అన్ని పార్టీలు రంగంలోకి దిగి.. ఎన్నికలను ఎదుర్కోవడానికి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ తొలి వారంలో తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందనే ప్రచారం జరుగుతున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 60 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. తెలంగాణలో అధికారం కోసం ఆరాటపడుతున్న బీజేపీకి.. 119 నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు ఎక్కడ ఉన్నారంటే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలో కొందరు ముఖ్య నాయకులు మాత్రం 40 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఎంపిక చేసి అధిష్టానానికి పంపించనున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ బీజేపీలో ఉన్న సీనియర్, ముఖ్య నాయకులతో కూడిన ఈ జాబితాను ఐదుగురు నేతలు వేర్వేరుగా తయారు చేసినట్లు తెలుస్తున్నది. గతంలో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు.. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న వారితో కలిపి ఈ జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థులను ముందు ఖరారు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు విడివిడిగా జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఏ నాయకుడి అనుచరులకు టికెట్లు వస్తాయో అనే ఉత్కంఠ నెలకొన్నది.

పార్టీ తరపున దాదాపు 40 మందితో కూడిన తొలి జాబితాను ముందుగానే ప్రకటిస్తే.. పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం వస్తుందని అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ ఎన్నికలకు బీజేపీ కూడా సర్వసన్నద్దంగా ఉన్నామనే సంకేతాలు పంపినట్లు ఉంటుందని అంచానా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉన్నందున.. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు అందరూ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేయాలని ఇప్పటికే అధిష్టానం సూచించింది. ఎంపీలు తమకు అనుకూలమైన అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎంచుకోవాలని చెప్పింది.

ఇక మిగిలిన స్థానాలకు బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సెగ్మెంట్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన నాయకులు, త్వరలో చేరబోయే నాయకుల్లో బలమైన వారికి తప్పకుండా టికెట్లు దక్కుతాయని మౌఖికంగా చెప్పినట్లు తెలుస్తున్నది. ఇతర పార్టీల్లో టికెట్లు రావనే అనుమానాలు ఉన్న నాయకులు, టికెట్లు నిరాకరించబడిన నాయకులను పార్టీలోకి తీసుకొని వచ్చి టికెట్లు ఇచ్చే ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తున్నది. 119 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టకుండా బీజేపీ అభ్యర్థులను నిలపాలని అధిష్టానం సూచించింది.

First Published:  4 Aug 2023 3:25 AM GMT
Next Story