Telugu Global
Telangana

నిజాంపై పోరాడింది క‌మ్యూనిస్టులు.. విజ‌యోత్స‌వాలు జ‌రుపుకుంటున్న‌ది ఆర్ఎస్ఎస్‌

హైదరాబాద్ సంస్థానాధిపతిగా 37 ఏళ్లపాటు ఇష్టారాజ్యం చెలాయించి ప్రజలను పీల్చి పిప్పి చేసిన ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను గద్దె దించడంలో సంఘ్ పరివార్ పాత్ర ఇసుమంతకూడా లేదు.

నిజాంపై పోరాడింది క‌మ్యూనిస్టులు.. విజ‌యోత్స‌వాలు జ‌రుపుకుంటున్న‌ది ఆర్ఎస్ఎస్‌
X

ఇతరులు కష్టపడి సాధించిన విజయాలను తమ ఖాతాలో వేసుకోవడం సంఘ్ పరివార్ కు చేతనైనట్టుగా మరే పక్షానికి సాధ్యం కాదు. హైదరాబాద్ సంస్థానాధిపతిగా 37 ఏళ్లపాటు ఇష్టారాజ్యం చెలాయించి ప్రజలను పీల్చి పిప్పి చేసిన ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ను గద్దె దించడంలో సంఘ్ పరివార్ పాత్ర ఇసుమంతకూడా లేదు. కానీ ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీ వచ్చే సరికి బీజేపీ సంబరాలు చేసుకోవాలని తెగ ఆరాట‌ప‌డిపోతూ ఉంటుంది.

నిజాం గద్దె దిగడానికి సర్దార్ పంపిన సేనలే కారణమని నమ్మే వారికి కొదవే లేదు. కానీ సెప్టెంబర్ 13న పటేల్ పంపిన సేనలు హైదరాబాద్ పొలిమేరల్లోకి ప్రవేశించే నాటికే ఉస్మాన్ అలీ ఖాన్ జీవచ్ఛవంలా మారిపోయారు. భారత సేనలు ఒక్క తుపాకీ గుండైనా పేల్చకుండానే నిజాం లొంగిపోయాడు. ఆయనలో మానసిక పరివర్తనో లేక‌ చాంద్రాయణ వ్రతం చేసిన పిల్లిలా హఠాత్తుగా సాధు జీవి అయినందువల్లో ఆయన గద్దె వీడలేదు. అంతకు ముందు 1946 నుంచి కమ్యూనిస్టు పార్టీ కొనసాగించిన చరిత్రాత్మక సాయుధ పోరాటం కారణంగానే నిజాం చేష్టలుడిగిపోయి ఉన్నారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దెనెక్కిన దశాబ్దానికే హైదరాబాద్ సంస్థాన్‌ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష పెరిగిపోయింది. తమ భాష సంస్కృతులను పరిరక్షించుకోవడానికి మొదట ఆంధ్ర జన సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘం ఒక సారి సమావేశం అయినప్పుడు ఆలంపల్లి వెంకట్రామారావు తెలుగులో మాట్లాడితే తెలుగు వారే ఆయనను హేళన చేసి వేదికమీద నుంచి దించేశారు. ఆ సభలోనే ఉన్న ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంత రావు మౌనంగా సభ నుంచి వెళ్లి పోయారు తప్ప ఎదిరించలేదు.

ఆ సంఘమే 1930 నాటికి ఆంధ్ర మహాసభ రూపం సంతరించుకుంది. ఆ మహాసభల నిర్వహణకు నిజాం కల్పించని అడ్డంకులే లేవు. గస్తీ నిషాన్ తిర్పన్ (జి.ఓ. నె. 53) ప్రకారం ఎవరైనా ఒక సభ పెట్టుకోవాలంటే నేరుగా నిజాం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. దయతలచి ఒక వేళ అనుమతించినా భాష, సంస్కృతి గురించి మాట్లాడుకోవలసిందే తప్ప రాజకీయాలు ప్రస్తావించడానికే వీలు లేదు. ఆ రోజుల్లో రాజకీయాలు పాలకులకే పరిమితం. ప్రజలకు రాజకీయాలతో సంబంధం ఉండటానికే వీల్లేదు.

ఒక్కొక్క మహాసభ నిర్వహించడానికి అనుమతి సంపాదించడం కోసం నానా యాతన పడవలసి వచ్చేది. క్రమంగా ఆంధ్ర మహాసభల్లో పరోక్షంగా రాజకీయాంశాలు ప్రస్తావనకు వచ్చేవి. నిజాం హయాంలో తెలుగు పాఠశాలలు లేవు. బహిరంగ ప్రదేశాలలో సైతం తెలుగులో మాట్లాడటం మహాపచారంగా ఉండేది. పాఠశాలల్లో విద్యా బోధన అంతా ఉర్దూలోనే. అధికార భాషగా తెలుగును అమలు చేయడం ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. కానీ నిజాం ఉర్దూను అధికార భాషగా కఠినంగా అమలు చేసేవారు. తెలుగు భాషను విపరీతంగా ఈసడించే వారు. "తెలంగీ బేఢంగీ" అని ఎద్దేవా చేసేవారు. ఇలాంటి స్థితిలోనే ఆంధ్ర మహాసభ ఒక్కో అడుగే ముందుకేసింది. ఆంధ్ర మహాసభలో కూడా అతివాద, మితవాద‌వర్గాలు ఉండేవి కానీ నిజాం అనుకూలురు ఎవరూ లేరు.

ఇంకోవైపు హిందూమతంలో ఛాందసత్వాన్ని తొలగించడానికి, సంస్కరణలు ప్రవేశ పెట్టడానికి ఏర్పడిన ఆర్య సమాజం మాత్రం ఆ రోజుల్లో ప్రగతిశీల వైఖరి అనుసరించేది. నిజాం అండతో రజాకార్లు హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమం జోరుగా సాగించే వారు. అలా ఇస్లాం మతంలో చేరిన వారిని మళ్లీ హిందువులుగా మార్చడంలో ఆర్యసమాజం నిమగ్నమై ఉండేది. ఆర్య సమాజంలో సంస్కరణ భావాలు ఉన్నందువల్ల దేశభక్తి ఉన్న వారు ఆర్య సమాజంతో కలిసి పని చేసేవారు. తొలి దశలో కమ్యూనిస్టులుగా మారిన వారిలో అనేక మంది ముందు ఆర్యసమాజంలో ఉండి తరువాత కమ్యూనిస్టులైన వారే. అలాగే పౌరహక్కుల కోసం ఆర్య సమాజం పాటు పడేది. ఆర్య సమాజం హిందూ మతోద్ధరణకు ఏర్పడ్డ సంస్థే అయినా హిందూమతోన్మాదం లేశ‌మంత కూడా ఉండేది కాదు. మరో రకంగా చెప్పాలంటే ముస్లిం వ్యతిరేకతను ఆర్య సమాజం ఎన్నడూ వ్యక్తం చేయలేదు. ఈ ధోరణి ప్రగతిశీల శక్తుల్ని ఆకర్షించింది.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడగానే నిషేధించిన నిరంకుశుడు. అలాంటప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఊసే తెలంగాణాలో ఉండటానికి వీలు లేదు. కానీ, 1939 లో కమ్యూనిస్టు భావాల వైపు ఆకర్షితులైన మఖ్దూం మొహియుద్దీన్, డా. రాజ్ బహదూర్ గౌర్, జవాద్ రజ్వీ, ఆలం కుందుమిరి, చంద్ర గుప్త చౌదరి లాంటి వారు కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆంధ్ర మహాసభను చాలా ప్రభావితం చేసింది. ఆంధ్ర మహాసభలో ఉన్న అతివాదులను చేరదీసింది. ఒక రకంగా ఇది హైదరాబాద్‌ సంస్థానంలో కమ్యూనిస్టు పార్టీ లాంటిదే.

ఆంధ్ర మహాసభ కార్యకలాపాలలో నిమగ్నమైన రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహియొద్దీన్, బద్దం ఎల్లా రెడ్డి 1946 జూలై 4న సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చారు. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. పదివేల గ్రామాలను సాయుధ పొరాటం విముక్తి చేసింది. భూస్వాముల గుప్పెట్లో ఉన్న పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టారు. ఈ పోరాటంలో నాలుగు వేలమంది కమ్యూనిస్టులు నేలకొరిగారు. భూస్వామ్య విధానానికి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది.

ఈ పోరాట నేపథ్యంలోనే నిజాం జవసత్వాలు ఉడిగిపోయాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి తొమ్మిది ప్రావిన్సులు (మునుపటి రాష్ట్రాలు) బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాయి. మిగతా ప్రాంతంలో 5వందల పైచిలుకు స్వతంత్ర సంస్థానాలు ఉండేవి. వీటిని భారత యూనియన్ లో విలీనం చేయడం, ముఖ్యంగా హైదరాబాద్, ట్రవన్ కోర్ కొచ్చిన్, జూనాగఢ్, కశ్మీర్ లాంటి పెద్ద సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేయడం కష్ట సాధ్య‌మే అయినా సాధించారు. బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇచ్చిన మాట వాస్తవమే. వాస్తవానికి బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇవ్వగలిగింది తమ అధినంలో ఉన్న తొమ్మిది ప్రావిన్సులకు, మరో పది చిన్న ప్రావిన్సులకు మాత్రమే. స్వాతంత్ర్యంతో పాటే దేశ విభజన కూడా జరిగిపోయింది. ఈ స్వతంత్ర్య సంస్థాన్‌లకు మౌంట్ బాటెన్ మూడు మార్గాలు చూపారు. ఒకటి పాకిస్తాన్ లో చేరిపోవడం. లేదా భారత యూనియన్ లో చేరడం, అదీ కాదంటే స్వతంత్రంగా ఉండిపోవడం. పాకిస్తాన్ లో చేరాలన్న కాంక్ష నిజాంకు లేకపోలేదు. కానీ భౌగోళికంగా కుదరని పని. అందుకని స్వతంత్రంగా ఉండిపోవాలనుకున్నాడు. ఐక్యరాజ్య సమితిలో తన ప్రతినిధిని కూడా నియమించుకున్నాడు. పోలీసు యాక్షన్ సమయంలో నిజాం ప్రతినిధి ఐక్యరాజ్యస‌మితి లో ఉపన్యసిస్తున్నాడు.

ఈ దశలో భారత సేనలు హైదరాబాద్ ను మూడు వైపుల నుంచి చుట్టుముట్టాయి. విధిలేక నిజాం అస్త్ర సన్యాసం చేయవలసి వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఒక వైపు కమ్యూనిస్టు పార్టీ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భీకరమైన సాయుధ పోరాటం కొనసాగిస్తున్న దశలోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన భారత ప్రభుత్వం 1947 నవంబర్ 29న నిజాం తో యథాతథ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే నిజాం నిరంకుశత్వం కొనసాగడాన్ని అనుమతించింది. ఇది అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ కు తెలియకుండా జరిగిందనుకోవడానికి వీలు లేదు. కానీ చివరకు నిజాంను గద్దె దించడానికి పోలీసు చర్య (నిజానికి సైనిక చర్యే) కేంద్ర ప్రభుత్వం నిర్ణయించక తప్పలేదు.

ఏమైతేనేమి 1948 సెప్టెంబర్ 17న నిజాం భారత యూనియన్ లో విలీనం కావడానికి అంగీకరించారు. దీన్ని సర్దార్ పటేల్ ఘనతగా చాటడానికి ప్రయత్నాలు అప్పుడూ జరిగాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 1948 నాటికి ఆర్.ఎస్.ఎస్. ఉంది కానీ రాజకీయ అంగమైన ప్రస్తుత బీజేపీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ అస్థిత్వంలోకే రాలేదు. ఆర్.ఎస్.ఎస్. నిజాం కు వ్యతిరేకంగా పెదవి అయినా విప్పిన దాఖలాలు లేవు. అయినప్పటికీ నిజాం ముస్లిం కనుక ఆయనను గద్దె దించడాన్ని సంఘ్ పరివార్ సంకుచిత మత దృష్టితోనే చూస్తోంది. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ పోరాటం నిజాం నికృష్ట పాలనకు వ్యతిరేకమైందే తప్ప ముస్లింలకు వ్యతిరేకమైంది కాదు. పోలీసు యాక్షన్ కు ఆదేశించింది సర్దార్ పటేల్ కనుక ఆయనకూ ముస్లిం వ్యతిరేక రంగు పులమాలని సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోంది. చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలనుకునే వారు మహాత్మా గాంధీ హత్య తరువాత ఆర్.ఎస్.ఎస్.ను నిషేధించిందీ పటేల్ హోం మంత్రిగా ఉన్నప్పుడేనన్న వాస్తవాన్ని వాటంగా విస్మరిస్తారు. స్వాతంత్ర్య పోరాట పుటల్లో తమకు స్థానమే లేదు కనుక అసలు చరిత్రను వక్రీకరిస్తోంది సంఘ్ పరివార్. అందుకే నిజాం కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తమైన రోజులో తమకు లేని వాటా కోసం చరిత్రను తస్కరించాలని ఆరాట పడ్తోంది.

Next Story