Telugu Global
Telangana

కమ్యూనిస్టు పార్టీలు ఏకమవ్వాలి

కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలని సీపీఐ ప్రతిపాదిస్తుంద‌ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. ఈ మేరకు విజయవాడలో జరుగనున్న ముసాయిదా రాజకీయ తీర్మానంలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

కమ్యూనిస్టు పార్టీలు ఏకమవ్వాలి
X

- సోషలిజమే ప్రత్యామ్నాయం

- కాంగ్రెస్ పార్టీ మారాలి

- సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో డి. రాజా

- ఏకీకరణకు మద్దతు పలికిన సీపీఎం కార్యదర్శి తమ్మినేని

దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు సైద్ధాంతిక ప్రాతిపదికన ఏకమవ్వాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలని మూడు దశాబ్దాల క్రితమే అప్పటి సీపీఐ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు వ్యాఖ్యానించిన విషయాన్ని రాజా గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలని సీపీఐ ప్రతిపాదిస్తుంద‌ని, ఈ మేరకు విజయవాడలో జరుగనున్న ముసాయిదా రాజకీయ తీర్మానంలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సీపీఐ మూడవ మహాసభలో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కామ్రేడ్ గుండా మల్లేశ్ ప్రాంగణంలో ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ మహాసభలో ప్రారంభ ఉపన్యాసం ఇచ్చిన డి.రాజా పలు విషయాలు వివరించారు.

Advertisement

సీపీఎం జనతా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని, అదే సమయంలో సీపీఐ జాతీయ ప్రజాస్వామ్యం గురించి చర్చిస్తోందన్నారు. వీటి విషయంలోనే సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీ ఏకీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుల సమక్షంలో కూడా వెల్లడించినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు సామాజిక న్యాయం, సమానత్వం అందాలంటే కమ్యూనిస్టు, వామపక్ష శక్తుల బలోపేతమే మార్గమని రాజా అన్నారు. దేశంలో ఉన్న పరిస్థితులు, నూతన సవాళ్లు ఎదురవుతున్నాయని.. వాటిని ఎదుర్కోవాలంటే బలమైన సీపీఐ పార్టీ నిర్మాణం జరగాలని ఆయన చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగం, లౌకిక వాదాన్ని ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ఓ మతోన్మాద, ఫాసిస్టు సంస్థ అని.. అది పార్లమెంటు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అణచి వేస్తోందని రాజా విమర్శించారు.

Advertisement

మొత్తం హిందువుల తరపున ప్రాతినిధ్యం వహించాలని ఆర్ఎస్ఎస్‌కు ఎవరూ బాధ్యతలు అప్పగించలేదని రాజా అన్నారు. ఈ ప్రభుత్వం శరవేగంగా నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తూ.. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోయడం ఒక్కటే తమ లక్ష్యం కాదని.. దానికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ఉందన్నారు. అందరికీ విద్య, ఆరోగ్యం, ఉపాధి, నివాసం, ఆహార హక్కు వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించడమే ప్రత్యామ్నాయ విధానమని రాజా స్పష్టం చేశారు. కార్మిక, కర్షక వర్గాలను కేవలం ఆర్థిక డిమాండ్ల కోసమే కాకుండా రాజకీయ అధికారం, విప్లవాత్మక సామాజిక మార్పు కోసం కూడా ఏకం చేయాలని రాజా అభిప్రాయపడ్డారు.

నయా ఉదారవాద విధానాల అమలుతో ప్రపంచవ్యాప్తంగా ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పెట్టుబడిదారి వ్యవస్థ వైఫల్యమని, ఇందుకు సోషలిజమే సరైన ప్రత్యామ్నాయమన్నారు. లాటిన్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆసియా దేశాల్లో వామపక్ష, వామపక్ష భావజాలాలు ఉన్న పార్టీలను ఎన్నుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో ప్రజలు తిరుగబడ్డారని.. అయితే దానికి సరైన నాయకత్వం అందించేవాళ్లు లేకపోవడం వల్ల విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లలేక పోయారని రాజా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కమ్యూనిస్టు పార్టీలు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి.. ప్రజలను రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్ పార్టీ దేశమంతటా విస్తరించిన ఓ లౌకిక పార్టీ.. అయితే అది అంతర్గత సంక్షోభంలో కూరుకొని పోయిందని డి. రాజా అన్నారు. ఆ పార్టీ ఆ సమస్యల నుంచి బయటపడి.. బీజేపీ వ్యతిరేక పోరాటంలో ముందుండాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తమ విధానాలను కూడా మార్చుకోవాలని సూచించారు. ఆ పార్టీ నేత పీవీ సర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే ఉదారవాద ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన సంగతి గుర్తు చేశారు. ఇప్పటికీ అవే విధానాలు, సంస్కరణలు సమర్థిస్తామంటే కుదరదన్నారు.

ఏకీకరణకు సంపూర్ణ మద్దతు: తమ్మినేని వీరభద్రం

సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలనే ప్రతిపాదనకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఐ మహాసభల్లో అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రత్యామ్నాయ మార్గాలంటే ఓ సంక్షేమ పథకమో, ఒక రాజకీయ నినాదమో కాదని.. మతోన్మాదం, నయా ఉదారవాద విధానాలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం ఇవ్వాలని ఆయన కోరారు. అలాంటి ప్రత్యామ్నాయం చూపించే శక్తి దేశంలో కేవలం కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఉందని వీరభద్రం స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రతీ ఒక్కరం చేయి చేయి కలుపుదామని.. రెండు పార్టీల రాజకీయ తీర్మానాలు ఒకే విధంగా ఉన్నాయని.. భవిష్యత్‌లో ఒకటయ్యేందుకు అవి ప్రాతిపదిక కావాలని ఆయన ఆశించారు.

పార్టీ పరంగా చిన్న తేడాలు ఉన్నప్పటికీ.. ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో సీపీఐ, సీపీఎం శ్రేణులు ఐక్య ఉద్యమాలు చేపట్టడం శుభపరిణామం అన్నారు. భవిష్యత్‌లో కూడా రెండు పార్టీల మధ్య స్నేహభావం పరిఢవిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఇటీవల బిహార్‌ నితీశ్‌కుమార్‌ ప్రభుత్వ ఏర్పాటు సాధారణ విషయం కాదని, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలకు ఇదొక రాజకీయ పరిణామమని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారీ విధానం పతనానికి ఇంకా పరిపక్వత రాలేదని, ఇలా అనేక కారణాలతోనే కమ్యూనిస్టు పార్టీలు బలం తగ్గిందని, అయినా కమ్యూనిస్టులు బెదిరిపోబోరని స్పష్టం చేశారు.

తెలంగాణ కమ్యూనిస్టు పార్టీది ఘనమైన చరిత్ర: కే.రామకృష్ణ

దేశంలోనే తెలంగాణ కమ్యూనిస్టుప పార్టీకి ఓ ఘనమైన చరిత్ర ఉందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేపట్టి, వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసిన ఘనత ఇక్కడి కమ్యూనిస్టు పార్టీదే అని అన్నారు. తెలంగాణ విమోచనమా? విముక్తి? దినమా అనే అంశంపై టీవీల్లో విస్తృతంగా చర్చల్లో పాల్గొంటున్న టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అసలు నాటి తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇందులో కొందరు వెన్నుపోటు పొడిచినవాళ్లు లేకపోలేదని.. అయితే కమ్యూనిస్టు పార్టీ మాత్రమే పోరాటం చేసి, అనేక త్యాగాలకు సిద్దపడిందని ఆయన అన్నారు. 2024లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాతంత్ర హక్కులు ఉండబోవని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మారుస్తారని ఆయన హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిస్సిగ్గుగా మసీదులు కూల్చాలని చెబితే, మరో ఎమ్మెల్యే మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

దోచుకునేవాళ్లు ఉన్నంత కాలం వారిని వ్యతిరేకించే కమ్యూనిజం ఉంటుంది: సురవరం

దోపిడీ, దోపిడీదారులు ఉన్నంత కాలం వారిపై తిరుగుబాటు చేసే కమ్యూనిజం ఉంటుంది. పాలకుల విధానాలు ఆర్థిక సంక్షోభం, మతోన్మాత నేపథ్యం అయితే అక్కడ కమ్యూనిస్టుల అవసరం పెరుగుతుందని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సువరం సుధాకర్ రెడ్డి అన్నారు. అమెరికాలో పెత్తందారీతనానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పురోగమిస్తున్నారని అన్నారు. పలు దేశాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కమ్యూనిస్టులు విజయం సాధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్టులు బలహీనపడ్డారన్నది వర్గ శత్రువుల ప్రచారం మాత్రమే అని.. అమిత్ షా లాంటి వ్యక్తులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఫాసిజం బీజేపీ రూపంలో ఓ ప్రమాదకర స్థితిని తీసుకొచ్చిందన్నారు. బీజేపీది బలుపు కాదని కేవలం వాపేనని అన్నారు. ఐక్య ఉద్యమాలతో మరింతగా బలపడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు సురవరం సుధాకర్ రెడ్డి సీపీఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

మతోన్మాదాన్ని ఎదుర్కుందాం: పువ్వాడ నాగేశ్వరావు

దేశానికి ప్రమాదకరంగా మారిన మతోన్మాదాన్ని ఎదుర్కుందామని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత తక్షణ కర్తవ్యమని ఆయన అన్నారు. పురోగమనంలో అడ్డువచ్చే శక్తులను తొలగించుకుంటూ.. విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పువ్వాడ పిలుపునిచ్చారు. కలిసి వచ్చేవారితో నడుస్తూ ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవాలని పువ్వాడ కోరారు.


Next Story