Telugu Global
Telangana

పోలీసు నియామకాలపై రేవంత్ సంచలన నిర్ణయం

ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్‌ జనరల్‌ సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంకు సూచించారు.

పోలీసు నియామకాలపై రేవంత్ సంచలన నిర్ణయం
X

పోలీసు నియామకాల్లో స్థానికతకు సంబంధించిన జీవో 46ను రద్దు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్ష చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో హైపవర్‌ కమిటీతో సీఎం సమావేశమయ్యారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి త్వరలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. గత ప్రభుత్వం మార్చి 2022లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. అక్టోబరు 4, 2023 నాటికి 15,750 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కోర్టు కేసు కారణంగా నియామక ప్రక్రియ పెండింగ్‌లో పడింది. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఈ మధ్యే హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో పోలీసు నియామకాలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సీఎం రేవంత్‌ రెడ్డి అడ్వకేట్‌ జనరల్‌ సలహాలు, సూచనలను కోరారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్‌ జనరల్‌ సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంకు సూచించారు. కొత్తగా వేసే నోటిఫికేషన్లకు జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అధికారుల సూచనలు విన్న సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో చర్చించి, మంత్రివర్గ ఉప సంఘం ద్వారా జీవో 46 రద్దుపై నిర్ణయం తీసుకుందామన్నారు.

First Published:  13 Feb 2024 2:03 AM GMT
Next Story