Telugu Global
Telangana

కుమారి ఆంటీ హోట‌ల్‌కు వెళ్ల‌నున్న సీఎం రేవంత్

హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి స‌మీపంలోని కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్‌కు చాలా క్రేజ్ ఉంది. మ‌ధ్యాహ్నం అయిందంటే వంద‌ల మంది అక్క‌డ భోజ‌నానికి బారుల తీర‌తారు.

కుమారి ఆంటీ హోట‌ల్‌కు వెళ్ల‌నున్న సీఎం రేవంత్
X

ఫుడ్ వ్లాగ‌ర్ల పుణ్య‌మా అని ఒక్క‌సారిగా వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిపోయి, ట్రాఫిక్ పోలీసుల దెబ్బ‌కు ఫుడ్ స్టాల్ మూసివేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిన కుమారి ఆంటీకి.. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి అండ‌గా నిలిచారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్ప‌డుతోంద‌ని ఆమె ఫుడ్ పాయింట్‌ను పోలీసులు నిన్న మూసేయించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె ఫుడ్ పాయింట్‌ను కొన‌సాగించుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని పోలీసుల‌ను సీఎం ఆదేశించారు.

ఫుడ్ పాయింట్ స్థ‌లం మార్చాల‌ని నిన్న పోలీసుల ఆదేశాలు

హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి స‌మీపంలోని కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్‌కు చాలా క్రేజ్ ఉంది. మ‌ధ్యాహ్నం అయిందంటే వంద‌ల మంది అక్క‌డ భోజ‌నానికి బారుల తీర‌తారు. యూట్యూబ్‌, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డంతో ఇటీవ‌ల ర‌ద్దీ మ‌రింత పెరిగింది. వ‌చ్చిన‌వారి వాహ‌నాల‌తో అక్క‌డ ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని ట్రాఫిక్ పోలీసులు మంగ‌ళ‌వారం ఫుడ్ పాయింట్ ఏర్పాటు చేయ‌కుండా కుమారి ఆంటీని అడ్డుకున్నారు. ఇక్క‌డి నుంచి వేరే ప్లేస్‌కు మార్చుకోవాల‌ని సూచించారు.

స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి

పోలీసుల ఆదేశాల‌తో కుమారి ఆంటీ ఆవేద‌న చెందుతున్న వైనం సోష‌ల్ మీడియాలో వైర‌లయింది. దీంతో ఈ విష‌యం సీఎం దృష్టికి వెళ్లింది. ఫుడ్ స్టాల్ కొన‌సాగించుకునేందుకు ఆమెకు అనుమ‌తించాల‌ని డీజీపీని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అంతేకాదు త్వ‌ర‌లోనే తాను కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సంద‌ర్శించాల‌ని సీఎం నిర్ణ‌యించారు.

First Published:  31 Jan 2024 10:32 AM GMT
Next Story