Telugu Global
Telangana

కెసీఆర్‌ వాగ్దానం అమలుకు రేవంత్‌ వ్యూహం!

లోక్‌సభ ఎన్నికల తరువాత బిఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని రేవంత్‌రెడ్డి ఇతర కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్న మాటల్ని గమనిస్తే ‘విలీనం’ అనే మాట వాడకుండానే విలీనం చేసుకునే పద్ధతిలో వ్యవహరిస్తున్న వైనం కనిపిస్తున్నది.

కెసీఆర్‌ వాగ్దానం అమలుకు రేవంత్‌ వ్యూహం!
X

తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఉద్యమ కాలంలో బిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆ మాట నిలబెట్టుకోకపోగా టీఆర్‌ఎస్‌ను కాలక్రమంలో బిఆర్‌ఎస్‌ చేశారు. తన కార్యరంగాన్ని తెలంగాణకు పరిమితం చేయకుండా విస్తరించాలనుకున్న కెసీఆర్‌ ఆశలకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గండి కొట్టాయి. కానీ, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కెసీఆర్‌ ఇచ్చిన మాటను సాకారం చేసేదిశగా రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. తన పొలిటికల్‌ కెరీర్‌లో ఒకదశలో టీఆర్‌ఎస్‌లో చేరాలనుకొని చేరలేకపోయిన రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ వాగ్దానం అమలుకు వేగిరపడటమే వైచిత్రి.

ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని గమనిస్తే బిఆర్‌ఎస్‌లో ఉన్నవారందర్నీ కాంగ్రెస్‌లో కలుపుకోవాలని రేవంత్‌రెడ్డి ఎంత తొందర పడుతున్నారో అర్థమవుతుంది. తాజాగా జిహెచ్‌ఎంసి మేయర్‌ గద్వాల విజయలక్ష్మిని చేర్చకున్నారు. బిఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ కె.కేశవరావు కాంగ్రెస్‌ కండువా కప్పుకోడానికి సిద్ధపడ్డారు. అంతేగాక బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పార్టీలోకి చేర్చుకుని వరంగల్‌ ఎం.పి. స్థానం నుంచి నిలబెట్టేందుకు సిద్ధపడ్డారు రేవంత్‌. బిఆర్‌ఎస్‌ ఎంపీల్ని, ఎమ్మెల్యేల్నీ, ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ వైపు తిప్పుకునే వ్యూహాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. వారందరూ నయానో భయానో కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపే పరిస్థితి కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లోని స్థానిక బిఆర్‌ఎస్‌ నాయకుల్లో అధికులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల తరువాత బిఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని రేవంత్‌రెడ్డి ఇతర కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్న మాటల్ని గమనిస్తే ‘విలీనం’ అనే మాట వాడకుండానే విలీనం చేసుకునే పద్ధతిలో వ్యవహరిస్తున్న వైనం కనిపిస్తున్నది. ఇప్పటికే కొందరు బిఆర్‌ఎస్‌ ఎంపీలను, సీనియర్‌ నాయకుల్ని కాంగ్రెస్‌లో చేర్చుకొని ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు. ఇతర పదవులు అప్పగించారు. బిఆర్‌ఎస్‌ నుంచి పోటీకి నిలబడే వారు సైతం వెనకడుగు వేసేలా తాయిలాలు ఆశచూపడమో, బెదిరించడమో చేస్తున్నారని వినికిడి.

లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వివిధ స్థాయిలలో ఉన్న బిఆర్‌ఎస్‌ నేతలను తమ వైపు తిప్పుకునే దిశగా రేవంత్‌ బృందం పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎక్కువగా పాల్గొనకుండా వుండేలా చూసుకుంటుంది.

12-13కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. కనీసం పది స్థానాలు గెెెలుచుకోగలిగితే కాంగ్రెస్‌కు తిరుగుండదని అనుకుంటున్నారు. తద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి తలపోస్తున్నారు. ఇందుకోసం బిఆర్‌ఎస్‌లో పలుకుబడి కలిగిన నేతలంతా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటే బిఆర్‌ఎస్‌ నామమాత్రంగా మిగిలిపోతుంది. కెసీఆర్‌ ఇచ్చిన కాంగ్రెస్‌లో ‘విలీనం’ వాగ్దానం మరో రూపంలో సాకారం కావాలని రేవంత్‌ కోరుకుంటున్నారు.

ఈ పరిణామాల వల్ల రాబోయే అయిదేళ్ళలో తన స్థానం పదిలంగా ఉంటుంది, కాంగ్రెస్‌ వర్సెస్‌ బిజెపి అన్న తీరులో రాజకీయాలు మలుపు తీసుకుంటాయని భావిస్తున్నది రేవంత్‌ రాజకీయ బృందం. మరోమాటలో చెప్పాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడంలో కెసీఆర్‌ ఏవిధంగా సఫలమయ్యారో బిఆర్‌ఎస్‌ ను లేకుండా చేయడంలో తాను సక్సెస్‌ కావాలని రేవంత్‌ అనుకుంటున్నారు. ఇది అంత సులువేం కాదు. కానీ ఇందుకోసం లోక్‌సభ ఎన్నికల వేళ దూకుడును పెంచి గేట్లను ఎత్తివేసారు. ఏడాదిలోగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందన్న కడియం శ్రీహరిని సైతం పార్టీలోకి ఆహ్వానించడమే ఇందుకు దాఖలా. బిఆర్‌ఎస్‌లో ఉన్న ఒకనాటి తెలంగాణ టిడిపి నాయకులందరూ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేలా పావులు కదుపుతున్నారు. కనుకనే లోక్‌సభ ఎన్నికల వేళ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గుత్తా సుఖేందర్‌ రెడ్డి వంటి వారు నోరు మెదపకుండా వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కెసీఆర్‌ అనుసరించే వ్యూహం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.

First Published:  30 March 2024 1:34 PM GMT
Next Story