Telugu Global
Telangana

గతం గురించి మాట్లాడదామంటే మేం రెడీ..

గతం గురించి మాట్లాడాలంటే తాము కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవన్నారు.

గతం గురించి మాట్లాడదామంటే మేం రెడీ..
X

కేటీఆర్ ప్రసంగం మధ్యలోనే సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. పదే పదే గత పాలన, గత ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. వారు పూర్తిగా మాట్లాడిన తర్వాత తాను సమాధానం ఇద్దామనుకున్నానని, కానీ తన సమాధానానికి వారు తహతహలాడుతున్నారని.. అందుకే ముందుగానే మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు రేవంత్ రెడ్డి. గతంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే.. కాంగ్రెస్ నేతలే సొంత ప్రభుత్వంతో కొట్లాడారని గుర్తు చేశారు. గతం గురించే మాట్లాడుకుందామనుకుంటే.. ఒకరోజంతా దాని గురించే మాట్లాడదామన్నారు. జూన్-2, 2014 తర్వాత జరిగిన పాలన, నాయకత్వం వ్యవహార శైలిపైనే తాము ఇప్పుడు మాట్లాడుతున్నామని అన్నారు రేవంత్ రెడ్డి.


గతంలో జరిగిన పరిపాలనో ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నవారికి పెద్ద పాత్ర లేకపోవచ్చు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు చాలామంది అప్పుడు కాంగ్రెస్ పాలనలో మంత్రులుగా పనిచేశారని గుర్తుచేశారు సీఎం రేవంత్ రెడ్డి. కడియం శ్రీహరి, గంగుల కమలాకర్, హరీష్ రావు సహా చాలామంది వైఎస్ఆర్ హయాంలో మంత్రులుగా పనిచేశారని చెప్పారు. నిజంగా అప్పుడు పాపాలు జరిగి ఉంటే.. ఆ పాపాలలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కదా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను పొందుపరిచారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, అది ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకేనని అన్నారు.

ఎక్స్ రే తీసినట్టుగా అన్నీ వివరిస్తాం..

గతం గురించి మాట్లాడాలంటే తాము కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలకు మనసుంటే గవర్నర్ ప్రసంగంలో ఉన్న విషయాలకు సహకరిస్తామని చెప్పాలని అంతేకాని శాపనార్థాలు పెడితే ప్రయోజనం ఉండదన్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవన్నారు. వారు జీవితకాలం ఇలాంటి శాపనార్థాలు పెడుతూనే ఉంటారని చెప్పారు రేవంత్ రెడ్డి. పాలకపక్షంగా తమ విజన్ డాక్యుమెంట్ ని సభలో పెట్టామని, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

First Published:  16 Dec 2023 6:23 AM GMT
Next Story