Telugu Global
Telangana

నెలరోజుల్లో రుణ మాఫీ- రేవంత్ రెడ్డి

రుణమాఫీ అమలు అంశంపై ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిధుల కోసం బ్యాంకు అధికారులతోనూ మాట్లాడనన్నారు.

నెలరోజుల్లో రుణ మాఫీ- రేవంత్ రెడ్డి
X

రైతు రుణమాఫీ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నెలరోజుల్లో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బ్యాంకుల దగ్గర రైతులు తీసుకున్న అప్పులు, వడ్డీలు అంతా కలిపి 32వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయన్నారు సీఎం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికే ఈ బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

రుణమాఫీ అమలు అంశంపై ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిధుల కోసం బ్యాంకు అధికారులతోనూ మాట్లాడనన్నారు. 6 గ్యారంటీల దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారులను ఎంపిక చేయడం పూర్తవ్వగానే రైతు రుణమాఫీని పట్టాలెక్కిస్తామన్నారు సీఎం. రైతు రుణమాఫీ అమలు కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కొంత పర్సంటేజీని ఆ కార్పొరేషన్‌కు డైవర్ట్‌ చేసి.. ఆ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.

అధికారంలోకి వస్తే ఒకేసారి రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పథకం అమలు దిశగా పని మొదలు పెట్టింది. అధికారుల నుంచి ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది. రైతుల అప్పులను అసలు, వడ్డీ లెక్కగట్టి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు.. బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణ గ్రహీతలుగా ఉన్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది.

First Published:  7 Jan 2024 5:19 AM GMT
Next Story